ఓక్సాకా: మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఓక్సాకా-వెరాక్రూజ్ మధ్యలో నిజండా శివారులో రైలు పట్టాలు తప్పడంతో 13 మంది మృతి చెందగా 98 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. రైల్వేపోలీసులు, భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కొండ చరియపైకి వంగి ఉన్న బోగీ నుంచి ప్రయాణికులు దిగడానికి రెస్క్యూ సిబ్బంది సహాయం చేస్తున్నారు. పసిపిక్ సముద్రం-గల్ఫ్ ఆఫ్ మెక్సికోను కలిపే లైనుపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు రైలులో 250 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై ఆ దేశ అటార్నీ జనరల్ ఆఫీసు దర్యాప్తు చేస్తోంది. మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది.