తిరువనంతపురం: శ్రీలంకతో ఆదివారం జరిగిన నాలుగో టి20 మ్యాచ్‌లో భారత మహిళా జట్టు 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపు ఆతిథ్య జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 40 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది. భారీ లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన లంకకు ఓపెనర్లు హసిని పెరెరా, చామరి ఆటపట్టు మెరుపు ఆరంభాన్ని అందించారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన హసిని 20 బంతుల్లోనే ఏడు ఫోర్లతో 33 పరుగులు చేసింది.
కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ఆటపట్టు 3 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 52 పరుగులు సాధించింది. దులాని (29), హర్షిత (20), నీలాక్షిక సిల్వా 23 (నాటౌట్) రాణించినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో వైష్ణవి, అరుధంతి రెండేసి వికెట్లను పడగొట్టారు. అంతకుముందు ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించారు. ఇద్దరు చెలరేగి ఆడారు. దూకుడుగా ఆడిన షఫాలీ 46 బంతుల్లోనే 12 ఫోర్లు, సిక్స్‌తో 79 పరుగులు చేసింది. మంధాన 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80 పరుగులు సాధించింది. రిచా ఘోష్ 16 బంతుల్లోనే అజేయంగా 40 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. దీంతో భారత్ 2 వికెట్లకు 221 పరుగుల రికార్డు స్కోరును సాధించింది.