మైనర్ బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మేడ్చల్ ప్రత్యేక న్యాయస్థానం నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2022 జూన్ 20వ తేదీ మధ్యాహ్నం 1 గంటల సమయంలో నిందితుడు, ఒడిశా రాష్ట్రం, గణపతి జిల్లా, నారాయణ్‌పూర్ గ్రామానికి చెందిన బికాష్ కుమార్ నాయక్ (40)ను న్యాయస్థానం దోషిగా తీర్పు వెల్లడించింది. నిందితుడు మైనర్ అయిన తన మేనకోడలిని ఆమె నివాసం నుంచి అపహరించాడు. ఈ ఘటనపై అదే రోజు రాత్రి 8 గంటలకు బాధితురాలి పెద్దనాన్న మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా మొదట ఐపిసి సెక్షన్ 363 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైం నెం. 533/2022 (ఎస్‌సి నెం. 1701/2022) కేసులు నమోదయ్యాయి. అనంతరం బాధితురాలిని గుర్తించి ఆమె వాంగ్మూలం నమోదు చేయడంతో కేసు సెక్షన్లు ఐపిసి 366, 376(2)(n), పోక్సో చట్టం సెక్షన్ 5 (1) చదివి 6గా మార్చారు.
దర్యాప్తులో భాగంగా 2022 జూలై 13న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానికి తరలించారు. ఈ కేసులో ఐపిసి సెక్షన్ 376 (2) (n), పోక్సో చట్టం సెక్షన్ 5 (1) కింద నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే ఒక సంవత్సరం సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని ఆదేశించింది. అదేవిధంగా ఐపిసి సెక్షన్ 366-A కింద 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా, ఈ జరిమానా చెల్లించని పక్షంలో 6 నెలల సాధారణ కారాగార శిక్ష విధించింది. ఎస్‌ఐ ఎ. మురళీధర్, ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సాక్ష్యాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ సమయంలో ప్రజా ప్రాసిక్యూటర్ విజయరెడ్డి ప్రాసిక్యూషన్, సాక్షులు, ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ పూర్తైన అనంతరం మేడ్చల్‌లోని అత్యాచారం, పోక్సో కేసుల విచారణ ప్రత్యేక న్యాయమూర్తి కె. వెంకటేష్ నిందితుడిని దోషిగా తేల్చి ఆయా శిక్షలు విధించారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించారు.