హైదరాబాద్: మాజీ సర్పంచ్ లు పెండింగ్ బిల్లుల కోసం చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా మంత్రులు ఎమ్మెల్యేల్లు నిర్ణయం తీసుకోవాలని మాజీ సర్పంచ్ లు డిమాండ్ చేశారు. ఫెండింగ్ బిల్లులు రూ.531 కోట్లు విడుదల చేయాలని అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో మనస్థాపంతో సర్పంచులు చలో అసెంబ్లీ బాటపట్టారు. అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ హెచ్చరించారు.
కొంత మంది సర్పంచులను హైదరాబాద్ కు చేరుకోకుండా కట్టుదిట్టంగా వివిధ మండలాల్లో మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులు చేసి దేశానికి ఆదర్శంగా గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దామని, అలాంటివారు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే ప్రభుత్వం కనీసం పెండింగ్ బిల్లులపై స్పష్టత ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. కనీసం ప్రభుత్వం జ్ఞాపకం చేయకపోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో మాజీ సర్పంచులపై కక్ష సాధింపు ఎందుకు అని ప్రశ్నించారు. మాజీ సర్పంచ్ లు, పోలీసుల మధ్య జరిగిన తోపులాటలో కొందరు సర్పంచ్ లు గాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కేశ బోయిన మల్లయ్య, వరంగల్ రవీందర్ రావు, సిద్దిపేట సుభాష్ గౌడ్, సూర్యాపేట యాకూబ్ నాయక్, అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు