న్యూఢిల్లీ: ఇంతకు ముందటి గ్రామీణ ఉపాధి పథకం ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ లోపాలు, దీని స్థానంలో వచ్చిన విబి జి రామ్ జి నిర్వహణపై కేంద్రం దృష్టి సారించింది. సోమవారం ఈ రెండు అంశాలపై పార్లమెంటరీ ప్యానెల్ సమీక్షించింది. ఇంతకు ముందటి వైఫల్యాలను చక్కదిద్దేందుకు, ఉపాధి గ్యారంటీ పేదలకు సక్రమంగా దక్కేందుకు కొత్త నథకం తీసుకువచ్చినట్లు కేంద్రం చెపుతోంది. ఈ వాదనను ప్రతిపక్షాలు తోసిపుచ్చాయి. పాత పథకం గాంధీజీ పేరిట ఉండగా దీనిని తీసివేశారని, సరైన విధివిధానాలు లేవని విమర్శలు వెల్లువెత్తాయి.
అన్ని విషయాల సమీక్షకు కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంబంధిత పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం అయింది. పథకం మార్పు జరిగినందున సక్రమ రీతిలో కొత్త పథకం అమలు సరిగ్గా జరిగేందుకు వచ్చే ఆరు నెలల పాటు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్యానెల్ నిర్ణయించించింది. కొత్త పథకం అమలుకు మరింత కేటాయింపులు అవసరం అని, లబ్ధిదారుల ఎంపికలో పలు చిక్కులు వస్తాయని అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది.