తనని కలిసినప్పుడు
ఇప్పటి బరువు, నెరవు గమనించి
మునుపటి గుర్తుతో పోల్చుకొని
నడకలో తొణుకుతున్న నలతని
శ్వాసలోని సందిగ్ధాన్ని
నవ్వులోని వైరాగ్యాన్ని
భుజాల వొంపులోని నైరాశ్యాన్ని
వీటన్నిటి కొలత తీసుకుంటేనే
నువ్వు తనని ప్రత్యక్షంగా పలకరించినట్టు
నీ రాక తెచ్చిన సంబరం
నీ స్పర్శ పంచిన సాంత్వన
గతం తాలుకు నెమరువేతలో
మళ్లీ రాజుకున్న జీవనలాలసనీ
తన స్వరం తిరిగి
సంతరించుకుంటున్న బలాన్ని
అంచనా వేసినప్పుడే
అప్పుడే, నువ్వు తనని
ప్రత్యక్షంగా పలకరించినట్టు
– ఉమామహేశ్వరి భృగుబండ