నందినగర్ నివాసానికి చేరుకున్న బిఆర్‌ఎస్ అధినేత
పాలమూరు -రంగారెడ్డి పథకంపై పోరాటానికి సిద్ధం కావాలని నేతలకు పిలుపు
ప్రభుత్వ ఎజెండాను బట్టి వ్యూహం రచించాలని పార్టీ నేతలకు సూచన
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ సమావేశాలకు హాజరుకావాలని బిఆర్‌ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం(డిసెంబర్ 29) ప్రారంభమయ్యే సమావేశాలకు తాను వస్తానని.. అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళదామని పార్టీ నేతలతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రం నుంచి నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో బలంగా పోరాటం చేస్తామని కెసిఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కెసిఆర్ పార్టీ ఎంఎల్‌ఎలకు దిశానిర్దేశం చేశారు. కాగా, మొదటి రోజు అసెంబ్లీ సమావేశానికి కెసిఆర్ హాజరుకావాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి కెసిఆర్ శాసనసభలో జరిగే చర్చలో పాల్గొననున్నారు. అయితే కెసిఆర్ అసెంబ్లీ వచ్చినా.. చర్చలో పాల్గొంటారా..లేదా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కెసిఆర్ చర్చలో పాల్గొంటే.. అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా జరుగనున్నయి. కెసిఆర్ ఈసారి అసెంబ్లీకి వస్తారనే సంకేతాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
కాగా, అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బిఆర్‌ఎస్ సిద్ధమైంది. ముఖ్యంగా కృష్ణా-గోదావరి నదీ జలాల హక్కుల రక్షణ, పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గించిన అంశం, రైతు రుణమాఫీ అమలు తీరు, హామీల అమలులో లోపాలు వంటి విషయాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయనున్నట్లు సమాచారం. కెసిఆర్‌తో పాటు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు సహా కీలక నేతలు కూడా ఈ సమావేశాల్లో పలు అంశాలను లేవనెత్తేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.