వ్యూహా-ప్రతివ్యూహాలతో సమాయత్తమైన పాలక-ప్రతిపక్షాలు
వివాదాలపై ‘జంగ్’.. కెసిఆర్ రాకపై ఉత్కంఠ
ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లుల ప్రతిపాదన
ఒక్క రోజా? మూడు రోజులా?
అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్ర శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు సోమవారం (29) నుంచి ప్రారంభంకానున్నాయి. సమావేశాలు శీతాకాలమే అయినా, చర్చలు చాలా వాడి-వేడిగా జరగనున్నాయి. సమావేశాలకు పాలక-ప్రతిపక్షాలు సమాయత్తమయ్యాయి. విపక్షాల విమర్శనాస్త్రాలకు ధీటైన జవాబులు చెప్పేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంత్రులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హాజరును కూడా తాను చూస్తానని, సభలు నిండుగా ఉండాలని, సభ్యులు కారిడార్ల (లాబీ)లో బాతాఖానీ పెట్టకుండా సమావేశాల సమయంలో పూర్తిగా కూర్చోవాలని ఆదేశించారు.
ఉత్కంఠ ఎందుకంటే..
ప్రతి ఏడాది బడ్జెట్ సమావేశాలు, ఆ తర్వాత వర్షాకాల, శీతాకాల సమావేశాలు జరుగుతుంటాయి. ఇది సర్వసాధారణమే. కానీ ఈ దఫా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నది బిఆర్‌ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కెసిఆర్ రాక కోసమే. కెసిఆర్ సభకు వస్తారని, కాదు వచ్చే అవకాశం లేదన్న చర్చ జరుగుతున్నది. కాగా గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనలో మార్పు వచ్చిందని, ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నారని సమాచారం. అంతేకాకుండా రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం రెండు సమావేశాలకు (ఆరు నెలల విరామం లేకుండా) హాజరుకాకుండా ఉంటే సదరు సభ్యుని సభ్యత్వం రద్దు అవుతుంది.
జల వివాదాలపై ‘జంగ్’
సమావేశాలకు ముందే పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య జల వివాదాలు రాజుకున్నాయి. కృష్ణా-గోదావరి నదీ జలాల హక్కుల రక్షణ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి వాటా తగ్గింపుపై గణాంకాలతో సమాయత్తమయ్యాయి. ప్రభుత్వం నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందని కెసిఆర్ లోగడ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.
మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్
జల వివాదాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించేందుకు జనవరి ఒకటో తేదీన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనుండడం గమనార్హం. దీంతో సభ ఒక్క రోజే కాదని, కనీసం మూడు నుంచి ఐదు రోజులు జరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. దమ్ముంటే కెసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి సవాల్ విసరడంతో పాటు కోస్గిలో జరిగిన బహిరంగ సభలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాలు గరం గరంగా సాగనున్నాయన్న సంకేతాలు అందుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్, మరో ప్రత్యర్థి పార్టీ బిజెపి ఇంత కాలం పరస్పరం ఆరోపించుకుంటుడగా, ఇప్పుడు ఇక అసెంబ్లీ, కౌన్సిల్ వేదికల ద్వారా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాల సభ్యులు చేసే ప్రతి విమర్శను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులకు దిశా నిర్దేశం చేసారు.
ఏడు ఆర్డినెన్స్‌ల స్థానంలో..
ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఏడు ఆర్డినెన్స్‌లను సభలో ప్రతిపాదించి ఆమోదించుకునే అవకాశం ఉన్నది. ఆర్డినెన్స్‌ల కాలపరిమితి ఆరు నెలలే కాబట్టి ఈ సమావేశాల్లో ప్రతిపాదించి ఆమోదించుకోవాలనుకుంటున్నది.
ఫోన్ల ట్యాపింగ్ పైనా హోరా-హోరి
మరోవైపు బిఆర్‌ఎస్ కూడా అధికార కాంగ్రెస్ సభ్యులు, మంత్రుల నుంచి ఎదురయ్యే విమర్శలు, ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతోంది. నీటి పారుదల ప్రాజెక్టులు, ముఖ్యంగా పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే అంశం కాకుండా ఫోన్ ట్యాపింగ్ పై కూడా చర్చకు పాలకపక్షం సిద్ధం అవుతోంది. ఈ సమాచారం ఆధారంగా దీనిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు బిఆర్‌ఎస్ సిద్ధమైంది.
‘హిల్ట్ ’, హైడ్రా పైనా..
పరిశ్రమలకు కేటాయించిన భూములను రెగ్యులరైజ్ చేసే అవకాశం కల్పించే వెసులుబాటు కల్పించే (హిల్ట్ పాలసీ)పై ప్రభుత్వంపై దాడికి విపక్షాలు సిద్ధమయాయయి. భూకబ్జాలు, అటవీ భూముల రక్షణ, హైడ్రాపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆరు గ్యారంటీలు గల్లంతయ్యాయని, ‘హైడ్రా’ పేరుతో పేదల ఇండ్ల కూల్చివేతలపై సభలో చర్చకు పెట్టాలని భావిస్తున్నాయి.
అవినీతిని ఎండగట్టాలని బిజెపి వ్యూహం
అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల్లో ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలని బిజెపి సమాయత్తమైంది. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే గ్లోబల్ సమ్మిట్ పేరిట ప్రజల దృష్టిని మళ్లించిందని ఇప్పటికే బిజెపి విరుచుకపడుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పాలన పట్ల సమస్యలను అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని విమర్శిస్తోంది. వీటన్నింటినీ ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని బిజెపి వ్యూహం. మరోవైపు మజ్లీస్, సిపిఐ సభ్యులు కూడా ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నాయి.
అధికారులతో స్పీకర్ భేటీ..
ఇదిలాఉండగా సమావేశాల నేపథ్యంలో ఏర్పాట్లపై కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా వారు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.