లండన్: మనీలాండరింగ్, రుణాల ఎగవేతల కేసుల్లో లండన్‌కు పారిపోయిన ఐపిఎల్ స్థాపకుడు లలిత్ మోడీ భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు తన తరఫున తోటి ఫరారీ విజయ్ మాల్యా వైపు నుంచి కూడా సారీ ప్రకటనలు సోమవారం వెలువరించాడు.ఇంటర్నెట్ ద్వారా భారత్‌ను షేక్ చేద్దామని సరదాగా స్పందించానని వివరణ ఇచ్చుకున్నాడు . లండన్‌లో ఇటీవలే విజయ్ మాల్యా 70వ జన్మదిన వేడుక జరిగింది. ఈ దశలో అక్కడికి లలిత్ మోడీ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అట్టహాసపు విందు జరిగింది.
ఈ దశలో మాల్యా తాను చట్టాపట్టాలేసుకుని ఉన్నప్పటి ఫోటోకు ఇద్దరు పేరుమోసిన బడా పరారీగాళ్లు అనే సరదా వ్యాఖ్యానం జత చేశారు. భారత్‌లో నేరాలకు పాల్పడి, చట్టానికి చిక్కకుండా వేరే దేశానికి చెక్కేసి, పైగా తనను ఎవరూ ఏమి చేయలేరనే ధోరణితో ఫోటోలు పెట్టినందుకు లలిత్ మోడీపై భారతీయ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. భారత విదేశాంగ శాఖ నుంచి తీవ్ర నిరసన తెలిపారు.
ఈ దశలో లలిత్ మోడీ స్పందించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తనకు భారత ప్రభుత్వం అంటే గౌరవం అని ఆయన తమ వివరణలో తెలిపారు. జోక్‌గా దీనిని భావించి ఉంటే బాగుండేదని, అయితే వేరే విధమైన సంకేతాలు వెళ్లినందున తాను క్షమాపణలు చెపుతున్నానని లలిత్ మోడీ తమ ప్రకటన వెలువరించారు. లలిత్ మోడీని, విజయ్ మాల్యాను భారత్‌లో చట్టపరమైన విచారణలకు పట్టి రప్పించేందుకు భారత ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఇద్దరిపై వేర్వేరుగా లండన్‌లో భారత ప్రభుత్వం ద్వారా కేసులు తుది దశ విచారణకు చేరాయి.