మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ దొర అహాంకారాన్ని బయటపెట్టారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. శాసన సభకు వచ్చిన కెసిఆర్ చనిపోయిన తోటి శాసన సభ్యులకు నివాళులు అర్పించే సమయం లేదన్నారు. దళితుడిగా ఉన్న స్పీకర్‌ను అధక్షా అని పిలివడం ఇష్టం లేక మూడు నిమిషాలకే పలాయనం చిత్తగించారని ఆరోపించారు. శాసన సభలో ప్రభుత్వం జీరో అవర్‌లో సుమారు 80 మంది ఎంఎల్‌ఏలకు సమస్యలు చెప్పే అవకాశం కల్పించిందని, ప్రజా సమస్యలను లేవనెత్తకుండా కెసిఆర్ వెళ్లిపోవడం సభను అవమాన పర్చడమేనని మండిపడ్డారు. కేవలం శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికే కెసిఆర్ అసెంబ్లీకి వచ్చారని ఆయన చెప్పారు.
బిఆర్ నాయకులు కెసిఆర్ అసెంబ్లీకి వచ్చి చీల్చి చెండాడుతారని ఊదరగొట్టారని, కానీ అసెంబ్లీకి సారోచ్చే..హాజరయ్యే, ఫాంహౌస్‌కు పోయారని ఏద్దేవా చేశారు. బయట ప్రగల్భాలు పలకడం కాదని జనవరి 2వ తేదీ నుండి జరిగే సమావేశాల్లో చర్యకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. దేవాలయం లాంటి శాసన సభలో స్పీకర్‌ను అధ్యక్షా అని పిలవని కెసిఆర్‌కు శాసన సభపక్ష నేతగా ఉండే అర్హత లేదన్నారు. పదేళ్లలో దొచుకున్న సొమ్ము వాటాల పంపకంలో గొడవలు మొదలయ్యాయని, కూతురు కవితకే సర్దిచెప్పడం రాని కెసిఆర్ కాంగ్రెస్‌ను చీల్చి చెండాడుతా అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చలకు సిద్దమని ప్రతిపక్ష నాయకుడిగా చర్చల్లో పాల్గొనాలని ఆయన డిమాండ్ చేశారు.