ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. విహారయాత్రకు వెళ్లొస్తూ ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఈ నెల 26వ తేదీన రెండు కార్లలో 10 మంది జనగామ జిల్లా నుంచి ఒడిశాలోని పూరి జగన్నాథ్‌స్వామి ఆలయానికి వెళ్లారు. దర్శనం ముగించుకొని తిరిగి విశాఖపట్నంలోని అరకు ప్రాంతంలో విహారయాత్ర చేసి తిరిగి ప్రయాణం అయ్యారు. వీరిలో అజయ్, కొల్లిపాక క్రాంతి, గట్టు రాకేష్, చిల్లర బాలకృష్ణ, రొయ్యల అనిల్ ఐదుగురు కారులో సత్తుపల్లి మీదుగా ముందు వస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు తల్లాడ మండలం, అంజనాపురం గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టడంతో చిల్లర బాలకృష్ణ (30) (కారు డ్రైవర్), రొయ్యల అనిల్ (31) గట్టు రాకేష్ (30) మృతి చెందారు.కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు కావడంతో ముందు సీట్లో కూర్చున్న ఇద్దరు ఇరుక్కుపోయారు.
జెసిబి సహాయంతో పోలీసులు అతి కష్టమ్మీద మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనం ద్వారా ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు జనగామ జిల్లా, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం, జఫర్‌ఘడ్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రెండవ ఎస్‌ఐ వెంకటేష్ దర్యాప్తు చేపట్టారు. దట్టమైన పొగ మంచు, కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, రెండు కార్లలో ప్రయాణిస్తున్న యువకులు చిన్నతనం నుంచి 10వ తరగతి వరకు ఒకటే స్కూల్లో చదివినవారు. మృతుల్లో ఒకరు ల్యాబ్ డయాగ్నిస్ట్ సెంటర్లో పనిచేస్తున్నాడు. మరొకరు మెడికల్ రిప్రజెంటే టివ్‌గా పనిచేస్తున్నాడు. వీరంతా వేర్వేరు ప్రాంతాల్లో ప్రైవేట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.