న్యూఢిల్లీ: పర్యావరణ ప్రాణప్రద ఆరావళి పర్వతాలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. గత నెల 20న వెలువరించిన తమ న్యాయస్థాన తీర్పు, సంబంధిత ఆదేశాలను ప్రస్తుతానికి పక్కన పెట్టింది. ఈ మేరకు సోమవారం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, ఆగస్టిన్ జార్జి మాసిహ్‌తో కూడిన వెకేషన్ బెంచ్ స్టే రూలింగ్ వెలువరించింది. ఆరావళి పర్వత నిర్వచనాలు ఇతర విషయాలపై ఇంతకు ముందటి కమిటీ వెలువరించిన ప్రతిపాదనలు దేశవ్యాప్త దుమారానికి దారితీశాయి. ఈ క్రమంలో ఈ కమిటి సిఫార్సుల అమలును నిలిపివేయడం జరుగుతుంది. అత్యున్నత స్థాయి కొత్త కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో సంబంధిత నిపుణులు, పర్యావరణవేత్తలు ఉండేలా ఏర్పాట్లు జరగాలి.
కమిట ఏర్పాటు అయ్యి, ఈ పర్వత శ్రేణుల విషయాన్ని క్షుణ్ణంగా, సముచిత రీతిలో విశ్లేషించే వరకూ ఇంతకు ముందటి ఆదేశాలను నిలిపివేయాల్సిందే అని ధర్మాసనం స్పష్టం చేసింది. పలు రాష్ట్రాల్లో విస్తరించుకుని ఉన్న ఆరావళి పర్వతాలు అత్యంత పురాతనమైనవి. పర్యావరణ హితంగా ఉంటున్నాయి.అయితే ఈ పర్వత శ్రేణులకు సంబంధించి వంద మీటర్లు అంటే 328 అడుగుల కన్నా ఎత్తున ఉండేవే కొండలు అని కేంద్ర కమిటీ పేర్కొంది. ఈ తక్కువ ఎత్తు ఆరావళి కొండలలో మైనింగ్‌కు అనుమతిని ఇచ్చింది.. అయితే అంతకు మించిన ఎత్తులో ఉండే పర్వతాలలో మైనింగ్ లీజును రద్దు చేశారు, తక్కువ ఎత్తు పర్వతాల పరిధికి రాదనే ఈ నూతన నిర్వచనం సరైనదే అని గత నెల సుప్రీంకోర్టు సమర్థించింది. ఆదేశాలు వెలువరించింది. వీటి అమలును నిలిపివేసిన వెకేషన్ బెంచ్ కేసు తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
స్టే విధింపు మంచి పరిణామం: కాంగ్రెస్
ఆరావళి పర్వత శ్రేణుల నిర్వచనంపై సుప్రీంకోర్టు స్టేను కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. పర్యావరణ రక్షణ బాధ్యత నిర్వర్తించలేని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి జై రామ్ రమేష్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి తమ పునర్విచనానికి అనుకూల రీతిలో సమర్థించుకునేందుకు నానా తంటాలు పడ్డారని, ఆయన వాదనను సుప్రీంకోర్టు ఇప్పుడు పూర్తిగా తిరస్కరించిందని కాంగ్రెస్ స్పందించింది. ఆరావళి పర్వతాలకు కొత్త రూపం వచ్చే రీతిలో కేంద్రం వెలువరించిన ప్రతిపాదనలను తమ పార్టీ అన్ని స్థాయిల్లో వ్యతిరేకించిందని కాంగ్రెస్ తెలిపింది.