14రోజుల జ్యుడిషియల్ రిమాండ్
జూన్ 30న పరిశ్రమలో పేలుడు.. 54 మంది దుర్మరణం
యాజమాన్యం నిర్లక్షమే కారణమని తేల్చిన సాంకేతిక నిపుణుల కమిటీ
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : సిగాచీ పరిశ్రమ ఎండి, సిఇఓ అమిత్ రాజ్ సిన్హాను అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్‌పి పరితోష్ పంకజ్ ఆదివారం సాయంత్రం మీడియాకు తెలిపారు. జూన్ 30న పటాన్‌చెరు మండ లం, పాశమైలారం పారిశ్రామికవాడలో ఉన్న సిగాచీ పరిశ్రమలో పేలుడు కారణంగా 54 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ఘోర దుర్ఘటన ఫలితంగా ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మృతదేహాల గుర్తింపు ప్రహసనంగా మారింది. శిథిలాలను తవ్వినప్పటికీ ఇంకా కొందరి ఆచూకీ లభించలేదు. ఆ కుటుంబాల బాధ వర్ణనాతీతం. 54 మందిని పొట్టనపెట్టుకున్న దుర్ఘటనపై అప్పట్లోనే..భానూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఆరు నెలలుగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఎట్టకేలకు యాజమాన్యంపై చర్యలు ప్రారంభమయ్యాయి. యాజమా న్యం నిర్లక్షం కారణంగానే ప్రమాదం సంభవించిందని ప్రభుత్వం నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ ఇటీవల నివేదికలో పేర్కొంది. ఈ కేసులో బాధ్యులను గుర్తించకపోవడంపై ఇటీవల హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు పరిహారం అందించడంలో కూడా ఇంకా అలసత్వం కొనసాగుతోంది. ఈ తరుణంలో గుట్టు చప్పుడు కాకుండా కంపెనీ ఎండిని జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం సాయంత్రం అరెస్టు చేసి జుడీషియల్ రిమాండుకు తరలించామని, గౌరవం న్యాయస్థానం నిందితునికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించిందని ఎస్‌పి పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.