మన తెలంగాణ/హైదరాబాద్‌ః ప్రజా సమస్యలు అనేక సంఖ్యలో ఉన్నాయి కాబట్టి సవివరంగా చర్చించి పరిష్కరించేందుకు అసెంబ్లీ సమావేశాలను కనీసం ఇరవై రోజులైనా నిర్వహించాలని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో వర్షాకాల సమావేశలను కేవలం ఒక్క రోజుకే పరిమితం చేసిన ఘనత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికే దక్కిందని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారానికి కృషి చేయాల్సిన వేదిక అసెంబ్లీ అని ఆయన తెలిపారు. ఇప్పుడు శీతాకాల సమావేశాల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్నారు.
రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రుణ మాఫీ పూర్తిగా అమలు కాలేదని, వరదల వల్ల పంట నష్టం జరిగినా సరైన పరిహారం అందలేదని ఆయన విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటించినా ఇంత వరకూ ఒక్క బిల్లునూ ఆమోదించలేదని ఏలేటి విమర్శించారు. సాగు నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయినా ఇంత వరకు కృష్ణా, గోదావరి బేసిన్లపై అసెంబ్లీలో సమగ్ర చర్చ చేపట్టలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన నలభై హామీలను ప్రజలు విశ్వసించి అధికారం కట్టబెట్టారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కాబట్టి వీటన్నింటిపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను కనీసం ఇరవై రోజులు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.