వారణాసి: ఈ ఏడాది భారత్ ఎన్నో ఘన విజయాలు సాధించిందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది తరలివచ్చారని, ప్రయాగ్ రాజ్ కుంభమేళాతో 2025 ప్రారంభం అయిందని అన్నారు. మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్ లో మోడీ పాల్గొన్నారు. మన్ కీ బాత్ లో దేశ ప్రజల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అంతరిక్షయానంతో శుభాంశుశుక్లా భారత కీర్తిని మరింత పెంచారని, ‘ ఆపరేషన్ సింధూర్’ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచిందని కొనియాడారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్ రెండో సదస్సును త్వరలోనే నిర్వహించునున్నామని, కొత్త ఆశలు, నూతన సంకల్పంతో 2026లోకి అడుగు పెడుతున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. రెండో యంగ్ ఇండియా లీడర్ సదస్సు జనవరి 12న జరగనుందని, వివిధ ప్రాంతాల యువత సదస్సులో ఆలోచనలు పంచుకుంటున్నారని అన్నారు. యంగ్ ఇండియా లీడర్ సదస్సులో తాను తప్పనిసరిగా పాల్గొంటానని తెలియజేశారు. యువశక్తే భారత్ కు ప్రధాన బలమని, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సరికొత్త టెక్నాలజీ, ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలని మోడీ సూచించారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ లో విద్యార్థులు 70 అంశాలపై ప్రతిభ చూపారని, స్మార్ట్ ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీపై ఆవిష్కరణలు ప్రదర్శించారని మోడీ పేర్కొన్నారు. గతేడాది వారణాసిలో కాశీ-తమిళ సంగమం జరుపుకున్నామని, వారణాసిలోని పిల్లలు తమిళం మాట్లాడుతున్నారని అన్నారు. మాతృభాష హిందీ అయినప్పటికీ తమిళం నేర్చుకుని మాట్లాడుతున్నారని, దేశంలో చిరుతల సంఖ్య 30 దాటిందని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.