ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీకి అరుదైన గౌరవం దక్కింది. తాజాగా బ్రెట్‌లీ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలోకి ప్రవేశించాడు. అత్యంత అరుదైన ఈ జాబితాలో లీ 66వ ఆటగాడిగా చేరాడు. లీ కంటే ముందు ఇదే ఏడాది (2025) మైఖేల్ క్లార్క్, మైఖేల్ బెవాన్, క్రిస్టినా మాథ్యూస్ ఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్, అలెన్ బోర్డర్, షేన్ వార్న్, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాలు ఉణ్నారు.
49 ఏళ్ల లీ 1999-2012 వరకు క్రికెట్ కెరీర్‌ని కొనసాగించాడు. తన ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. వికెట్లు తీయడం కంటే వేగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. తన కెరీర్‌లో అత్యుత్తమంగా గంటకు 161.1 కిమిల వేగంతో బంతిని సంధించాడు. ఇది క్రికెట్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన బంతి. తొలి స్థానంలో పాకిస్థాన్ బౌలర్ షోయబ్ అక్తర్ వేసిన బంతి ఉంది. తనకు ఈ ప్రతిష్టాత్మక గౌరవం దక్కడంపై లీ హర్షం వ్యక్తం చేశాడు. ఈ స్థాయికి రావడానికి పేస్ దిగ్గజం డెన్నిస్ లిల్లీ కారణం అని చెప్పాడు. 9 ఏళ్ల వయస్సు నుంచి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయాలని కలలు కన్నట్లు చెప్పాడు.