మన తెలంగాణ/హైదరాబాద్‌ః ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సూచించారు. సోమవారం నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు ప్రసంగిస్తూ ప్రభుత్వ అసమర్థ పాలనపై బలమైన స్వరం వినిపించాలని, ప్రజాపక్షంగా రాష్ట్ర ప్రజల జీవన సమస్యలను సభ దృష్టికి తేవాలని సూచించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో పార్టీ సభ్యులు సమన్వయంతో ఉండాలని ఆయన సూచించారు. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం పార్టీ బలమైన పాత్ర పోషించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అంఇజరెడ్డి, ఎవిఎన్ రెడ్డి, మల్క కొమురయ్య, ఎమ్మెల్యేలు వెంకటరమణా రెడ్డి, రాకేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.