మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ మహానగర రాజకీయాల్లో గత యాభై ఏళ్లుగా చెరగని ముద్ర వేసిన ధీశాలి, నిఖ్సాన మాస్ లీడర్ పి. జనార్ధన్ రెడ్డి (పిజెఆర్) అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కొనియాడారు. పిజెఆర్ 18వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఖైరతాబాద్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూనే, ప్రజల ప్రయోజనాల కోసం సొంత ప్రభుత్వాన్ని నిలదీసిన ధైర్యశాలి పిజెఆర్ అని గుర్తుచేశారు. ముఖ్యంగా కృష్ణా జలాలు తెచ్చి హైదరాబాద్ దాహార్తి తీర్చాలనే నినాదంతో ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కెసిఆర్ నాయకత్వంలో జరిగిన అద్భుత అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఉంటే పిజెఆర్ గుండె ఆనందంతో పులకించిపోయేదని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరాభివృద్ధిపై పిజెఆర్‌కు ఉన్న విజన్‌ను బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిజం చేసిందని చెప్పారు. భవిష్యత్ తరాల నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా, ప్రజా సేవలో పిజెఆర్ చూపిన నిబద్ధతను, శ్రద్ధను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సేవలోనే కన్నుమూసే అరుదైన భాగ్యం పిజెఆర్‌కు దక్కిందని అన్నారు. పిజెఆర్ ఆశయాలను ఆయన కుమారుడు, మాజీ ఎంఎల్‌ఎ విష్ణువర్ధన్ రెడ్డి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కెటిఆర్ ప్రశంసించారు.
జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయాన్ని పిజెఆర్ ఆలోచనలకు అనుగుణంగా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ అభివృద్ధి చేయడంతో పాటు హైదరాబాద్ నగర ప్రజల సంక్షేమంలో ఆయన తనదైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్‌ఎలు ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డి, ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్, మాగంటి సునీత గోపీనాథ్, కార్పోరేటర్లు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జననేతకు పిజెఆర్‌కు నీరాజనాలు అర్పించారు.