హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో నిర్మాత సురేష్ బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్ధతుతో ఆయన విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో మన ప్యానల్ పేరిట చిన్న నిర్మాతలు, ప్రోగ్రెసివ్ ప్యానల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తన బలాన్ని నిరూపించుకుంది. మొత్తం 48 మంది కార్యవర్గానికి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 31, మన ప్యానెల్ నుంచి 17 మంది గెలుపొందారు. కార్యదర్శిగా అశోక్ కుమార్, ఉపాధ్యక్షులుగా సూర్య దేవర నాగవంశీ, భరత్ చౌదరి ఎన్నికవగా, కోశాధికారిగా ముత్యాల రామదాసులు గెలుపొందారు. జాయింట్ సెక్రటరీగా మోహన్ వడ్లపట్ల విజయేందర్ రెడ్డిలు విజయం సాధించారు. తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌లో మొత్తం 3,335 మంది సభ్యులున్నారు. ఛాంబర్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగనుంది.