న్యూఢిల్లీ: యుపిఎ ప్రభుత్వ హయాం నుంచి అమలవుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజిఎన్‌ఆర్‌జిఎ) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకు రావడంపై దేశ వ్యా ప్తంగా కాంగ్రెస్ ‘ఎంజీనరేగా బచావో అభియాన్’ పేరున జనవరి 5నుంచి భారీ ఎత్తు న ఆందోళన సాగించడానికి నిర్ణయించిం ది. శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సి డబ్లుసి) సమావేశంలో ఈ మేరకు నిర్ణ యం తీసుకున్నారు. గతంలో కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై ఎంత వ్యతిరేకత వచ్చిందో ఇప్పుడు ఎంజిఎన్‌ఆర్‌జి పథకాన్ని రద్దు చేయడంపై కూ డా అంతే ఎత్తున తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆనాడు వ్యతిరేకత వల్లనే వ్యవసాయ చట్టాలను మోడీ ప్రభుత్వం చేసేది లేక వెనక్కు తీసుకోవలసి వచ్చింది. ఇప్పుడు అదే వి ధంగా ఉపాధి కొత్త పథకాన్ని కేంద్ర ప్రభు త్వం వెనక్కు తీసుకోకతప్పదని కాంగ్రెస్ హెచ్చరిస్తోంది.ఈ నేపథ్యంలో సిడబ్లుసి సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షు డు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ మహాత్మాగాంధీ ఉపాధి పథకాన్ని రద్దు చేయడం మహాత్మా గాంధీకే తీరని అవమానంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కొన్నిపూర్వాపరాలను ఉదహరించారు. “భూసేకరణచట్టానికి 2015లో సవరణలు తీసు కు వచ్చిన కేంద్రం తిరిగి వెనక్కు తీసుకోక తప్పలేదు.
ఆర్డినెన్సుల రూపంలో వ్యవసా య చట్టాలను పార్లమెంట్‌లో ఆమోదింప చేసుకున్నా విపక్షాల తీవ్ర నిరసనలతో 202021లో తిరిగి వెనక్కు తీసుకున్నా రు. ” అని ఖర్గే ఉదహరించారు. “ రాహుల్ గాంధీ చాలా కాలం క్రితమే వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకుంటుందని ముందుగానే అంచనా వేసినట్టుగానే జరిగింది. ఇప్పుడు ఎంజిఎన్‌ఆర్‌జిఎ తిరిగి అమలయ్యేలా పటిష్టమైన ప్రణాళికలు రూపొందించడం, జాతీయ స్థాయిలో ప్రచారోద్యమం సాగించడం మన సమష్టి బాధ్యత ” అని ఖర్గే పేర్కొన్నారు. ఈ క్లిష్ట కాలంలో ప్రజలు కాంగ్రెస్ వైపు ఆశతో చూస్తున్నారని చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే గురించి మాట్లాడుతూ ప్రజల ప్రజాస్వామిక హక్కులను పరిమితం చేసే కుట్రగా విమర్శించారు. బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మకై ఇదంతా చేస్తున్నారన్నారు. ఈ సర్వేలో మన ఓటర్ల పేర్లు తొలగించకుండా చూసుకోవాలని, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ సమాజాల ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తీసివేయబడకుండా లేదా ఇతర బూత్‌లకు బదిలీ చేయకుండా చూసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఓటు చోరీపై రాహుల్ గాంధీ అనేక ఉదాహరణలు చూపించారన్నారు. 2027 ఎన్నికలకు సిద్ధం అయ్యేలా ఇప్పటి నుంచే కార్యకర్తలు ఆమేరకు రాష్ట్రాల్లో పని ప్రారంభించాలన్నారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండించారు. క్రిస్మస్ రోజున క్రైస్తవులపై దాడులు జరగడం వెనుక బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు సంబంధం ఉండడం సామాజిక సామరస్యాన్ని అస్తవ్యస్తం చేస్తుందని, ప్రపంచంలో భారత్ ప్రతిష్ఠకు తీరని కళంకం తెస్తుందని ఆక్షేపించారు.
ఎంజినరేగా పథకం కాదు.. రాజ్యాంగం కల్పించే హక్కు
సిడబ్లుసి సమావేశం తరువాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాత్రికేయ సమావేశంలో ఎంజీనరేగా బచావో అభియాన్ ఉద్యమం ఎందుకు చేపట్టవలసి వస్తోందో వివరించారు. ఎంజీఎన్‌ఆర్‌జిఎ కేవలం ఒక పథకం కాదని, రాజ్యాంగం కల్పించిన పనిచేసే హక్కుగా అభివర్ణించారు. ఈ పథకం రద్దుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఎంజీఎన్‌ఆర్‌జిఎ కేంద్ర బిందువుగా ఈ ఉద్యమం సాగుతుందన్నారు. ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితులైనా కాపాడుకోవాలన్న కృతనిశ్చయంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ కార్మికుల గౌరవం,ఉపాధి, వేతనాలు సకాలంలో చెల్లింపు తదితర హక్కులు కోసం , డిమాండ్ ఆధారిత ఉపాధి, గ్రామ సభ నిర్వహణ తదితర ముఖ్యమైన అవసరాల కోసం మనం సమైక్యంగా పోరాడవలసి ఉందన్నారు. ఎంజిఎన్‌ఆర్‌జిఎ నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం, కార్మికుల హక్కులను దయాబిక్షంగా మార్చివేయడం వెనుక దాగి ఉన్న కుట్రను కాంగ్రెస్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యతిరేకిస్తుందని ఖర్గే చెప్పారు. కొత్త పథకం నిర్వహణలో కేంద్రం, రాష్ట్రాలు భరించవలసిన ఖర్చుల భాగస్వామ్యం గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రాలకు అదనపు భారం పడుతుందని, ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. పేదలను అణగదొక్కడానికి తీసుకు వచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా బయట వీధుల్లోను, పార్లమెంట్ లోనూ పోరాటం సాగిస్తామన్నారు.
సమష్టి పోరాటానికి వ్రతిపక్షనేతలకు రాహుల్ పిలుపు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసి దానిస్థానంలో కొత్తచట్టం తీసుకు రావడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఇది పేద ప్రజలపై దాడిగా పేర్కొన్నారు. సంబంధిత మంత్రులను సంప్రదించకుండా ప్రధాని మోడీ తన సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, దేశంలో పాలన వన్ మ్యాన్‌షోగా మారిపోయిందనడానికి ఇదే ఉదాహరణ అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి నియంతృత్వ చర్యలకు వ్యతిరేకంగా పోరాడడానికి ముందుకు రావాలని ప్రతిపక్ష నేతలకు పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన ఈ పథకాన్ని ఎలా మారుస్తారని ప్రశ్నించారు. ఆ తరువాత పాత్రికేయుల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రాలపైన, పేద ప్రజల పైన దాడి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉదహరించారు.
బీహార్ ఎన్నికల తరువాత మొదటి సిడబ్లుసి సమావేశం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్ ఓటమి పొందిన తరువాత సిడబ్లుసి సమావేశం జరగడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌వీర్ సింగ్ సుఖు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, పార్టీ సీనియర్ నేత శశిథరూర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలో అగ్రనేతలంతా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. అలాగే దివంగత నేతలు శివరాజ్‌పాటిల్, శ్రీప్రకాష్ జైస్వాల్ లకు సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.