తమిళ సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసింది. తమళ అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేమికులు దళపతి అంటూ ప్రేమగా పిలుచుకొనే నటుడు విజయ్ తన సినీ ప్రస్థానానికి ముగింపు పలికారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘జననాయగన్’ తన చివరి సినిమా అంటూ విజయ్ స్వయంగా ప్రకటించారు. కౌలాలంపూర్‌లో జరిగిన ‘జననాయగన్’ ఆడియో లాంచ్ వేడుకలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ‘‘నా కోసం ఎంతో మంది అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారు. ఇంతకాలం నన్ను సపోర్ట్ చేసిన వారి కోసం మరో 30 ఏళ్లు నేను నిలబడతా. ఈ అభిమానులకు సేవ చేయడం కోసమే నేను సినిమాలకు స్వస్తి పలుకుతున్నా’’ అని విజయ్ పేర్కొన్నారు.
విజయ్ తన కెరీర్‌లో మొత్తం 70+ సినిమాల్లో నటించారు. తెలుగులో వచ్చిన ఒక్కడు రీమేక్‌గా వచ్చిన ‘ఘిల్లీ’ చిత్రంతో విజయ్‌కి మంచి గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచి ఆయన తన కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. కొన్ని సినిమాలు అయితే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. విజయ్ సినిమాల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించడంతో ఆయన అభిమానులు ఒకింత నిరాశకు గురైనా.. రాజకీయాల్లో తమకు మరింత చేరువ అవుతారని తెలిసి సంతోష పడుతున్నారు. ఇక జననాయగన్ సినిమాకి హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తుండగా.. పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.