న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాల్సి ఉందని పార్టీ ఎంపి శశి థరూర్ ఆదివారం చెప్పారు. పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పార్టీ బలోపేతం గురించి మాట్లాడటంపై స్పందించారు. ఆయనతో తాను ఏకీభవిస్తున్నానని తిరువనంతపురం ఎంపి స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిల సంస్థాగత బలోపేత వ్యూహాలు ప్రశంసనీయం అని, మోడీ పాత ఫోటోలను జతచేస్తూ దిగ్విజయ్ సింగ్ సామాజిక మాధ్యమంలో స్పందించడం పార్టీలో తీవ్ర దుమారానికి దారితీసింది. ఇప్పుడు థరూర్ ఈ విషయంపై మాట్లాడారు. పార్టీని పటిష్టం చేయాల్సి ఉందని, ఈ విషయంలో మరో మాటకు తావు లేదని, చర్చ కూడా అవసరం లేదని తెలిపారు. కాంగ్రెస్ 140వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం సిడబ్లుసి సమావేశం సందర్భంగా థరూర్, సింగ్ పక్కపక్కనే కూర్చున్నారు.
సీనియర్ మాటలపై ముందుగానే మాట్లాడుకున్నారా? అనే విలేకరుల ప్రశ్నకు థరూర్ నవ్వుతూ స్పందించారు. తామిద్దరమూ స్నేహితులమని, మాట్లాడుకుంటూ ఉంటామని , పక్క పక్కనే కూర్చోవడం మాట్లాడుకోవడానికే అనుకోవచ్చు అని చమత్కరించారు. సమావేశ నేపథ్యం కీలకమైనది. పార్టీ ఏర్పాటు రోజును గుర్తు చేసుకునేది. ఈ దశలో పార్టీ మరింతగా బలోపేతం కావాలని అనుకోవడంలో తప్పేమీ లేదని థరూర్ తెలిపారు. దేశానికి ఘననీయ సేవలను పార్టీ అందిస్తూ వచ్చిన దశలో వ్యవస్థాపక దినం చిరస్మరణీయం చారిత్రాత్మకం అవుతుంది. ఈ దశలో మనం పార్టీ పటిష్టత దిశలో స్పందిస్తే తప్పేమీ లేదని పార్టీలో ఇప్పటికే అధినాయకత్వం అసంతృప్తికి గురైన థరూర్ చెప్పారు. దిగ్విజయ్ సింగ్ స్పందనపై పార్టీలో మరికొందరు ఎంపిలు, నేతల నుంచి కూడా బిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
దిగ్విజయ్‌తో తాను ఏకీభవించడం లేదని పార్టీ నేత పవన్ ఖేడా చెప్పారు. పార్టీ అధికార ప్రతినిధి, మాజీ జర్నలిస్టు సుప్రియా శ్రీనాతే మాట్లాడారు. దిగ్విజయ్ చెప్పిన దానిని ఆర్‌ఎస్‌ఎస్ వక్రీకరిస్తోంది. గాడ్సే నుంచి స్ఫూర్తి పొంది, విద్వేషాలు రెచ్చగొట్టిన సంస్థ నుంచి మనం నేర్చుకోవల్సింది ఏమీ లేదన్నారు. సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఘనమైనది, మన నుంచిఇతరులు నేర్చుకోవల్సింది ఎంతో ఉంది. మన వ్యతిరేక సిద్ధాంతాలలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ను ఏ విషయంలోనూ ఆదర్శంగా తీసుకోవల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. రాజీవ్ శుక్లా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మూలాలు విస్తరించుకుని ఉన్నాయని, వీటిని ఎవరూ ఏ విధంగా కూడా కుదిపివేయలేరని స్పష్టం చేశారు.