భారతీయ సమాజంలో భర్తను కోల్పోయిన మహిళలు, వివాహం కాని మహిళలు, విడాకులు పొందిన లేదా విడిపోయిన మహిళలు, వదిలివేయబడిన మహిళలను చారిత్రకంగా అశుభంగా భావించే దురాచారం బలంగా వేళ్లూనుకుంది. పితృస్వామ్య వ్యవస్థలో మహిళ సామాజిక గుర్తింపు ప్రధానంగా ఆమె వివాహ స్థితితోనే ముడిపడి ఉండటమే ఈ భావనకు మూలం. దీని ఫలితంగా ఒంటరి మహిళలు సామాజిక, ధార్మిక కార్యక్రమాల నుంచి బహిష్కరణకు గురవుతూ, వారి వేషధారణ, ప్రవర్తన, జీవనశైలిపై అనవసర ఆంక్షలు ఎదుర్కొంటున్నారు. సతీసహగమనం వంటి అమానవీయ ఆచారాలు నిషేధించబడినప్పటికీ, వివక్ష మాత్రం రోజువారీ జీవితంలో సూక్ష్మంగా కానీ బలంగా కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం 2014లో నిర్వహించిన కుటుంబ సర్వే ప్రకారం, రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది ఒంటరి మహిళలు ఉన్నారు. కొత్త పథకాల నిర్వచనాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణాల్లో 35 ఏళ్లు దాటిన వివాహం కాని మహిళలను కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.
అయినప్పటికీ, ఇది ప్రజా విధానాలు, అభివృద్ధి చర్చల్లో తరచూ నిర్లక్ష్యం చేయబడుతున్న పెద్ద సామాజిక వర్గం. ఒంటరి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మూలాలు పితృస్వామ్య సామాజిక నిర్మాణంలోనే ఉన్నాయి. మహిళ విలువను ఆమె భర్తతో ఉన్న సంబంధం ఆధారంగా కొలిచే పరిస్థితుల్లో, ఆ సంబంధానికి బయట ఉన్న మహిళలను సమాజం సాధారణానికి భిన్నంగా చూస్తుంది. దీని వల్ల వనరులపై హక్కులు తగ్గుతాయి, ఆస్తి, న్యాయ హక్కులు బలహీనపడతాయి. ఆర్థిక అసురక్షితత, సామాజిక ఒంటరితనం, మానసిక ఒత్తిడి ఒకదానికొకటి బలపరుస్తూ వీరి జీవితాలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, ఒంటరి మహిళలు ఇప్పటికీ వినిపించని స్వరాలుగానే ఉన్నారు. చాలామంది భద్రతలేని, తక్కువ జీతాల అసంఘటిత ఉపాధులకే పరిమితమవుతుండగా, కుటుంబ సంరక్షణ బాధ్యతలు మొత్తం వారి మీదే పడుతున్నాయి. స్థిర ఆదాయం లేకపోవడం వల్ల పేదరికం నుంచి బయటపడడం కష్టమవుతోంది.
అవసరమైన పత్రాలు, సరైన అవగాహన లేకపోవడం, సామాజిక వివక్ష, వారి తరఫున మాట్లాడే వ్యక్తి లేకపోవడం వంటి కారణాలతో పెన్షన్‌లు, ఆరోగ్య సేవలు, నివాస సదుపాయాలు వంటి ప్రభుత్వ ప్రాథమిక సంక్షేమ సేవలకే పొందడమనేది కూడా పెద్ద సవాలుగా మారుతోంది. ఒంటరి మహిళల గౌరవాన్ని కాపాడాలంటే కేవలం ఆర్థిక సహాయం సరిపోదు. సమాజపు దృక్పథంలో మార్పు రావలిసిన అవసరం ఉంది. ఈ వాస్తవాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన చర్యలు చేపట్టింది. 2025లో ఆసరా పథకం క్రింద ఒంటరి మహిళల పెన్షన్‌ను నెలకు రూ. 4,000కి పెంచింది. ఇది వారికి కీలక ఆదాయ సహాయంగా నిలుస్తోంది. అంతేకాకుండా, స్వావలంబనను ప్రోత్సహించే దిశగా ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ద్వారా అర్హులైన మైనారిటీ మహిళలకు ఒకసారి రూ. 50,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇది చిన్న వ్యాపారాలు, సూక్ష్మ ఉపాధులకు దోహదపడే చర్యగా మారింది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలు (SHGs) బలోపేతం అవుతూ, ఒంటరి మహిళలకు రుణాలు, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక అవగాహన, మార్కెట్ అనుసంధానాన్ని అందిస్తున్నాయి.
ఆరోగ్య పథకాలు, పోషకాహార కార్యక్రమాలు, షీ- టీమ్ వంటి భద్రతా చర్యలు వారి గౌరవం, భద్రతపట్ల ప్రభుత్వ నిబద్ధతను చూపిస్తున్నాయి. అయితే పెన్షన్‌లు తాత్కాలిక ఉపశమనానికే పరిమితమవుతుండగా, అవగాహన లోపం, సామాజిక వివక్ష వల్ల చాలామంది లబ్ధి పొందలేకపోతున్నారు. చిన్న వ్యాపారాల స్థిరత్వానికి నిరంతర మార్గదర్శకత్వం, మార్కెట్ మద్దతు అవసరం; అలాగే ఒంటరి మహిళల మానసిక ఆరోగ్యానికి ఇంకా తగిన ప్రాధాన్యం లభించడం లేదు. ఒంటరి మహిళల సాధికారత అనేది కేవలం సంక్షేమ అంశం కాదు; అది అభివృద్ధికి కీలక అంశం. ఆర్థికంగా స్వతంత్రమైన మహిళ తన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుంది, పిల్లల భవిష్యత్తులో పెట్టుబడి పెడుతుంది, సమాజాన్ని బలోపేతం చేస్తుంది. ఆమె సాధికారత రాష్ట్ర ఆర్థిక, సామాజిక నిర్మాణంపై బహుళ ప్రభావాన్ని చూపుతుంది.
సమగ్ర అభివృద్ధికి ఆదర్శంగా నిలవాలని ఆశిస్తున్న తెలంగాణ రాష్ట్రం, ఒంటరి మహిళల కోసం ప్రత్యేకమైన, సమగ్ర విధాన రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. సామాజిక భద్రత, ఆర్థిక సాధికారత, న్యాయ పరిరక్షణ, కౌన్సెలింగ్ సేవలు, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, వివక్షను ఎదుర్కొనే చర్యలు అన్నీ ఒకే చట్రంలో ఉండాలి. చవకైన నివాసాలు, సురక్షిత ప్రజా స్థలాలు, అందుబాటులో ఉన్న న్యాయ సహాయం, లక్ష్యబద్ధమైన ఉపాధి కార్యక్రమాలు ఈ విధానానికి పునాది కావాలి. ఒంటరి మహిళల సాధికారత ఒక భిక్షకాదు అది వారి హక్కు, న్యాయం, సమానత్వానికి సంబంధించిన అంశం.తెలంగాణ అభివృద్ధి నిజంగా అర్థవంతంగా మారాలంటే, ఒంటరిగా నిలబడాల్సిన పరిస్థితుల్లో ఉన్న ఒక్క మహిళ కూడా వెనుకబడకూడదు.
– మామిడాల లక్ష్మిప్రసాద్
88976 83592