మనతెలంగాణ/హైదరాబాద్ : శాసనసభను కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందని మాజీమంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు విమర్శించారు. బిఆర్‌ఎస్ హయాంలో ఏడాదికి సగటున 32 రోజులు అసెంబ్లీ నడిపితే.. కాంగ్రెస్ సగటున 20 రోజులే సమావేశాలు నిర్వహించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2024లో 24 రోజుల పాటు సభను నడిపారని గుర్తుచేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు 15 రోజులు నడపగా, సోమవారం సభ జరిగితే 16 రోజులు అవుతుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సగటున ఏడాదికి 20 రోజుల మాత్రమే సభను నడిపిందని తెలిపారు. అందులో ఇద్దరు ఎంఎల్‌ఎలు చనిపోతే రెండు రోజులు సంతాప తీర్మానాలు పెట్టారు, మూడు శ్వేతపత్రాలు, ఒక రోజు ఘోష్ కమిషన్ రిపోర్టు, బిసి రిజర్వేషన్లపై ఒక రోజు సభ పెట్టారని అన్నారు.
ప్రతిపక్షంపై బురద జల్లడానికే సమావేశాలు పెడుతున్నారు తప్ప ప్రజా సమస్యలు చర్చించడానికి కాదు అని ఆరోపించారు. అసెంబ్లీని 45 రోజుల పాటు జరపాలని గతంలో కాంగ్రెస్ డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. సభ నడిపేందుకు ప్రభుత్వం జంకుతోందని ఆరోపించారు. తాము ఇచ్చిన అజెండాను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని, సభను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఎన్ని రోజులైనా సభ నడుపుతామని బయటకి చెబుతూ, ఆచరణలో మాత్రం సభ నడిచే రోజులను కుదిస్తుందని పేర్కొన్నారు.
ఈసారి కనీసం 15 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. శాసనసభా వ్యవహారాల మంత్రిగా శ్రీధర్‌బాబు విఫలమయ్యారని, రెండేళ్లు దాటినా.. అసెంబ్లీలో ఒక్క హౌస్ కమిటీ వేయలేదని విమర్శించారు. హౌస్ కమిటీని ఎందుకు నియమించటం లేదని నిలదీశారు. అంచనాల కమిటీ చైర్మన్‌గా పద్మావతిని నియమిస్తే బాధ్యతలు తీసుకోకుండానే ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం అడుగుతున్న అజెండాను ఎందుకు తీసుకోవటం లేదని హరీష్‌రావు ప్రశ్నించారు.