మన తెలంగాణ/హైదరాబాద్‌ః డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామంటూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఒకవైపు చెబుతుంటే ఈ నెలాఖరున కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవాలంటూ మద్యం దుకాణాలకు అర్థరాత్రి వరకూ అనుమతించడం ఏమిటని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్రగ్స్, గంజాయి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక మంది డ్రగ్స్ సేవిస్తున్నారని, విచ్చల విడిగా విక్రయాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. దీనిపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త సంవత్సరం వేడుకల కోసమంటూ మద్యం దుకాణాలను అర్థరాత్రి వరకూ తెరిచి ఉంచేందుకు అనుమతించడం పట్ల రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు.