బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు అజీజ్ నగర్ చెరువులో అక్రమంగా నిర్మించుకున్న ఫామ్ హౌస్‌ను ‘హైడ్రా’తో కూల్చి వేయించాలని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చొరవ తీసుకోవాలని మైనంపల్లి శనివారం మీడియా సమావేశంలో తెలిపారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నాయకులకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసింది మీరు కాదా? అని ఆయన ప్రశ్నించారు. పోలీసులతో కొట్టించి, బెదిరింపులకు పాల్పడింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. అసైన్‌మెంట్ భూములను విక్రయించింది, దోచుకున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. ఉన్నతాధికారులను బూతులు తిట్టారని, కెటిఆర్‌కు అమెరికాలో చదువుకున్న సంస్కారం కూడా లేదని ఆయన దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేయలేని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం రెండేళ్ళలో చేసిందని మైనంపల్లి తెలిపారు. తమ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి అర్హులైన వారికి ఇస్తుందని ఆయన చెప్పారు.