తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొన్న శుక్రవారంనాడు ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో మూడు, నాలుగు జిల్లాల పార్టీ ముఖ్యులను, సీనియర్ నాయకులను పిలిపించుకుని చాలాసేపు చర్చలు జరిపారు. రేపటినుండి ప్రారంభం కాబోతున్న శాసనసభ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ ఫామ్ హౌస్ సమాలోచనలకు ప్రాముఖ్యత ఏర్పడింది. రాజకీయ పార్టీలు కొన్ని సమావేశాలు బహిరంగంగా జరుపుతుంటాయి. కొన్నిటి విషయంలో గోప్యతని పాటిస్తూ ఉంటాయి. అది ఆయా పార్టీల ఇష్టం. అంతమాత్రం చేత మీడియా ఆ సమావేశంలో ఏం జరిగిందో తమకున్న పరిచయాల ద్వారా తెలుసుకొని ప్రజలకు తెలియజేసే పని మానుకోదు. కొన్ని సందర్భాల్లో ఆ సమావేశాలు నిర్వహించిన రాజకీయ పార్టీల నాయకులే ప్రజలకు తెలియాల్సిన మేరకు సమాచారాన్ని మీడియావారికి ఉప్పందిస్తుంటారు. శనివారంనాడు దాదాపు తెలుగు పత్రికలన్నీ కేసీఆర్ ఫామ్ హౌస్‌లో జరిగిన సమాలోచనలకు సంబంధించిన వార్తలను మొదటి పేజీలో ప్రచురించాయి. ఒక్క భారత రాష్ట్ర సమితికి సంబంధించిన మీడియాలో తప్ప. ఫామ్ హౌస్‌లో జరిగిన సమాలోచనల్లో కేసీఆర్ పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సంబంధించిన నాయకులతో మాట్లాడి శాసనసభ సమావేశాల అనంతరం బహిరంగ సభలు నిర్వహించాలని, ఆ సభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తెలంగాణకు చేస్తున్న జలద్రోహాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రేపు ప్రారంభం కాబోయే శాసనసభ శీతాకాల సమావేశాల్లో కూడా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గురించి మాట్లాడదామని చెప్పినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. రేపు తొలి రోజున కేసీఆర్ స్వయంగా సభకు హాజరవుతారని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి.
కేసీఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్న, ఆయన పార్టీకి చెందిన ఆంగ్ల, తెలుగు దినపత్రికలు, టీవీ ఛానల్‌లో మాత్రం ఫామ్ హౌస్ సమాలోచనలకు సంబంధించిన వార్తలేమీ లేవు. లేకపోగా కేసీఆర్ శాసనసభకు వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుండె ఆగి చస్తాడని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు చేసిన వ్యాఖ్యలను మాత్రం టీఆర్‌ఎస్ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. ప్రజలు ఓట్లేసి గెలిపించి పంపేది తమ సమస్యల గురించి చర్చించి చట్టాలు చెయ్యండని. మరి ఈ గుండె ఆగి చనిపోతారన్న శాపనార్ధాలు ఏమిటో? సరే, పార్టీ అగ్రనేతకు సంబంధించిన వార్త లేకుండా రెండవశ్రేణి నాయకుడి ఈ ప్రకటనను ప్రధానంగా ప్రచురించడం విశేషం. బహుశా ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో జరిగిన సమావేశానికి సంబంధించిన సమాచారం అధికారిక మీడియాలో వస్తే అది కచ్చితంగా జరుగుతుందని ప్రజల భావిస్తారు. ఇతర మీడియాలో వచ్చిన వార్తల్ని అయితే ఖండించడానికి వీలుంటుంది అని కావచ్చు. కేసీఆర్ శాసనసభకు రేపు రాకపోతే పత్రికలు ఇష్టం వచ్చినట్టు ఊహాగానాలు ప్రచారం చేస్తే మేము బాధ్యులమా అని కొట్టి పారేయవచ్చు.
కేసీఆర్ శాసనసభకు రావడమా, రాకపోవడమా అన్నది ఆయన నిర్ణయం. దాదాపు రెండు సంవత్సరాలైనా ఆయన రాజకీయంగా బయట క్రియాశీలకంగా లేకపోయినా అడిగింది ఎవరు, ఇవాళ వస్తే వద్దనేది ఎవరు? అయితే ఒక రాజకీయ పార్టీ అగ్రనేత కదలికలను గురించి, ఆయన వ్యవహారశైలి గురించి తెలుసుకోవాలని ప్రజలనుకోవడంలో తప్పులేదు. ప్రజలకు ఆ సమాచారాన్ని తెలిపేందుకు మీడియా ప్రయత్నించడంలో తప్పులేదు. అయినా ఏ రాజకీయపక్షమైనా వారి వారి వ్యక్తిగత వ్యవహారాలు తప్ప ప్రజా జీవితానికి సంబంధించి వారు చేసే పనులు, చేపట్టే కార్యక్రమాలు, జరిపే సమాలోచనలు రహస్యంగా ఉండాలని కోరుకోవడం విడ్డూరం. పిడికిలి మూసి ఉన్నంత వరకూ అందులో ఏముందో ఊహించుకునే హక్కు మీడియాకు ఉంటుంది. ఒక్కసారి పిడికిలి తెరిచి చూపిస్తే ఉన్నది ఉన్నట్టుగా చెప్పక తప్పని పరిస్థితి మీడియాది. అప్పుడు అసత్యాలు రాసినా, చూపించినా, చెప్పినా మీడియాను నిలదీసే అధికారం రాజకీయపక్షాలకు ఉంటుంది. మొన్నటి బిఆర్‌ఎస్ ఎర్రవల్లి సమావేశం ఒకటే కాదు, దాదాపు అన్ని రాజకీయ పార్టీలు చాలా సందర్భాల్లో ఇలానే చేస్తుంటాయి. దానివల్ల ఊహాగానాలకు రాజకీయపక్షాలే అవకాశం ఇస్తున్నట్టు అవుతుంది కదా. సరే, అది అలా ఉంచితే కేసీఆర్ అధికారిక మీడియా మినహా మిగతా మీడియాలో వచ్చినట్టుగా కేసీఆర్ శాసనసభకు వస్తున్నారా, వస్తే ఏం జరుగుతుంది?
గత వారం కేసీఆర్ ఉమ్మడి పాలమూరు పట్టణం గురించి, ఉమ్మడి రాష్ట్రంలో దానికి జరిగిన అన్యాయం గురించి, కృష్ణానది మహబూబ్ నగర్ జిల్లానుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నా ఆ జిల్లాకు తప్పని నీటి ఘోష గురించి పార్టీ సమావేశంలో, మీడియా గోష్టిలో చాలా వివరంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు శాసనసభలో ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుని చర్చించాలని నిర్ణయించింది. త్వరలో జరగనున్న జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు సంబంధించి ఈసారి సభలో ప్రధానంగా చర్చించాలని అనుకున్నా, ఇతర ముఖ్యమయిన అంశాలు ఉన్నా, కేసీఆర్ నీళ్ల అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అధికారపక్షం కూడా ఇప్పుడు అదే అంశాన్ని ప్రధానంగా చర్చకు తీసుకునేందుకు సిద్ధం చేసినట్టయింది. మొత్తానికి ఈ శాసనసభ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య జలయుద్ధానికి వేదికగా మారనున్నాయనేది స్పష్టం.
గత ఆదివారంనాటి సమావేశంలో కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు పదేపదే ప్రస్తావిస్తూ నదీజలాల పంపిణీ విషయంలో మరొకసారి ప్రాంతీయ సెంటిమెంటును ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. అందరికీ గుర్తుండే ఉంటుంది, 2018లో కూడా కెసిఆర్ ఎన్నికల ప్రచారానికి ప్రజల ముందుకు వెళ్ళింది చంద్రబాబు అనే ఆయుధం తోనే. ఇప్పుడు కూడా ఆ ఆయుధాన్నే ప్రయోగించడానికి ఆయన సిద్ధం అవుతున్నట్టు ఉన్నారు. 2018 నాటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. ఆ ఎన్నికలనాటికి ఆయన ఇంకా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో సఖ్యంగానే ఉన్నారు. నిజానికి 2019లో జరగాల్సిన ఎన్నికలు ఆరుమాసాలు ముందుకు జరిపి 2018 లోనే నిర్వహించుకునేందుకు ఆయనకు అవకాశం కలిగింది కూడా మోడీ ఆమోదంతోటే. ఆ తర్వాత మళ్లీ ఐదేళ్లు ఆయన అధికారంలో ఉన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు పైబడి అధికారంలో ఉన్నారు. రాష్ట్రం ఏర్పడటానికి ముందు 2009 నుండి 2014 వరకు అదే మహబూబ్‌నగర్‌కు ఆయన లోకసభ సభ్యుడిగా ఉన్నారు. పాలమూరు నీటి కష్టాలను గురించి, అక్కడి ప్రజల ప్రతినిధిగా లోకసభలో ఆయన చేసిన పోరాటం ఏమిటి? ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఆయన చేసిన ప్రయత్నం ఏమిటి? అని ప్రత్యర్థి రాజకీయవర్గాలు ప్రశ్నించడంలో తప్పులేదు కదా.గత ఆదివారంనాడు ఆయన పాలమూరు జిల్లా నీటి సమస్యల గురించి మాట్లాడిన వెంటనే ఇటు కాంగ్రెస్, అటు బిజెపి పక్షాలు సహజంగానే ఆయన మీద విరుచుకుపడ్డాయి.
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచందర్రావు, మరో బీజేపీ లోకసభ సభ్యుడు రఘునందనరావు తదితరులు కేసీఆర్ వాదనను ఖండిస్తూ మాట్లాడారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు అయిన వెదిరె శ్రీరామ్ కూడా కేసీఆర్ వాదనను తప్పుపట్టారు. కాంగ్రెస్, బిజెపి నాయకులు రాజకీయంగా కేసీఆర్‌ను విమర్శించారనుకున్నా శ్రీరామ్ వెల్లడించిన వివరాల మీద కేసీఆర్ గానీ, ఆయన తరఫున బీఆర్‌ఎస్ గాని తప్పనిసరిగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకం చేశారని శ్రీరామ్ చెప్పారు. 2014 ఏపీ విభజన చట్టంలోని పరిమితులవల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నది శ్రీరామ్ వాదన. ఆ చట్టం ప్రకారం కృష్ణా జలాల వాటాకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్‌ను ముట్టుకోవడానికి వీల్లేదు. అంటే కొత్త కేటాయింపులు ఉండవు.ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేటాయింపులు మాత్రమే ఉంటాయి. మరి ఆనాడే ఉద్యమ నేతగా కేసీఆర్ దీన్నెందుకు వ్యతిరేకించలేదు? 2017 లో జరిగిన ఒప్పందంలో పాలమూరు వాటా ఎందుకు అడగలేదు? ట్రిబ్యునల్ లో వాదించి ఉంటే 400 నుంచి 450 టీఎంసీల నీరు పాలమూరుకు దక్కి ఉండేవన్నది శ్రీరామ్ వాదన. వీటన్నిటికీ రేపు శాసనసభకు వచ్చి గాని, బయట గాని కేసీఆర్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది కదా.
రేపు ప్రారంభం కానున్న శాసనసభ శీతాకాల సమావేశాల్లో తెలంగాణకు అత్యంత అవసరమైన నది జలాల పంపిణీలో ఎవరి పాత్ర ఎంత అన్న విషయంలో ఏ మేరకు చర్చ జరుగుతుందో అనుమానమే. బయటమాత్రం సభకు సారొస్తారా లేదా అన్న చర్చ జోరుగా సాగుతున్నది. శాసనసభకు రండి అన్ని విషయాలు చర్చిద్దాం అని కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే విసురుతున్న సవాల్‌ను స్వీకరించి కేసీఆర్ సభకు వస్తారా లేదా? సార్ సభకు వచ్చినా వార్తే, రాకున్నా వార్తే!