గిరిజన హక్కుల సాధనలో నేటికీ కీలకంగా నిలుస్తున్న శాస్త్రీయ ప్రమాణాలను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన తెగల గుర్తింపు, విలీనం వంటి అంశాలు పరిష్కారం దొరకని దీర్ఘకాలిక సమస్యగా మారాయి. రాజ్యాంగంలోని 5, 6 గిరిజన షెడ్యూళ్లలో పొందుపరిచిన ఆదిమ గిరిజన తెగల హక్కులకు నిజమైన లబ్ధిదారులు.. ఆదివాసీలు ఇంకా న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో, సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయంలో స్పష్టమైన చొరవ చూపకపోతే అంతర్జాతీయ న్యాయస్థానాల దారి వెతకాల్సిన పరిస్థితి వస్తుందా? అనే సందిగ్ధత ఆదివాసీ సమాజంలో నెలకొంది. ఇలాంటి సమయంలో ఎస్‌టి గుర్తింపుకు సంబంధించిన చారిత్రకమైన, శాస్త్రీయమైన మార్గదర్శకత్వం అందించిన జస్టిస్ లోకూర్ కమిటీ ప్రాధాన్యతను పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది.
లోకూర్ కమిటీ నేపథ్యం: స్వాతంత్య్రం అనంతరం భారతదేశంలో షెడ్యూల్డ్ తెగల గుర్తింపు విషయంలో స్పష్టత లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా కొనసాగింది. ఈ పరిస్థితుల్లో, 1965, జూన్ 1న అప్పటి ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వంలో భారత ప్రభుత్వం గిరిజన తెగల జీవన విధానం, సామాజిక స్థితి, రిజర్వేషన్లపై సమగ్ర అధ్యయనం కోసం జస్టిస్ భీమ్ జీ నారాయణరావ్ లోకూర్ (బి.ఎన్.లోకూర్) అధ్యక్షతన ఒక సలహా కమిటీని నియమించింది. ఎస్‌టి గుర్తింపుకు అవసరమైన ప్రమాణాలను శాస్త్రీయంగా, స్పష్టంగా ప్రతిపాదించిన మొదటి కమిటీగా లోకూర్ కమిటీ చరిత్రలో నిలిచింది. కమిటీ సూచించిన ప్రధాన ప్రమాణాలులోకూర్ కమిటీ ప్రకారం, ఏదైనా సమాజాన్ని షెడ్యూల్డ్ ట్రైబ్‌గా గుర్తించాలంటే ఒక్క లక్షణం సరిపోదు. కింది నాలుగు ప్రమాణాల్లో ఎక్కువ భాగం ఆ సమాజానికి వర్తించాలి.
1. ఆదిమ గిరిజన లక్షణాలు: సాంప్రదాయబద్ధ జీవన విధానం, వేట, ఆహార సేకరణ, చేతిపనులు వంటి పాత తరాల వృత్తులు, ఆధునికీకరణ తక్కువగా ఉండటం వంటి లక్షణాలు కనిపించాలి. 2. ప్రత్యేక సంస్కృతి: మిగతా సమాజాలకు భిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రత్యేక భాష లేదా మాండలికం, ప్రత్యేక ఆచారాలు ఉండాలి. ఈ ప్రత్యేకతే ఆ సమాజాన్ని వేరుగా గుర్తించే ప్రధాన లక్షణం. 3. భౌగోళిక విభిన్నత: అడవులు, కొండ ప్రాంతాలు, అభివృద్ధికి దూరంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో నివాసం ఉండటం, ప్రధాన సమాజంతో పరిమిత సంబంధాలు కలిగి ఉండటం. 4. వెనుకబడిన స్థితి: సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా తీవ్రమైన వెనుకబాటుతనం ఉండటం. జీవన పరిస్థితులు, అవకాశాల లేమి ద్వారా ఇది స్పష్టంగా కనిపించాలి.
ఎస్‌టి జాబితాలో చేర్చే ప్రక్రియ: ఏదైనా కులం లేదా తెగను ఎస్‌టి జాబితాలో చేర్చే ప్రక్రియ పలు దశలుగా సాగుతుంది. మొదట రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తుంది. అనంతరం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో పరిశోధనలు, సర్వేలు, సామాజిక అధ్యయనాలు నిర్వహిస్తారు. రిజర్వేషన్ వల్ల కలిగే ప్రభావాలను విశ్లేషించిన తరువాతే పార్లమెంట్ చట్టం ద్వారా ఎస్‌టి జాబితాలో చేర్పు జరుగుతుంది.
లోకూర్ కమిటీ సూచనల మాటేమిటి? లోకూర్ కమిటీ 800కు పైగా గిరిజన, సామాజిక సమూహాల చారిత్రక, సామాజిక, విద్య, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి తీవ్రమైన వెనుకబాటుతనాన్ని ప్రధాన ప్రమాణంగా తీసుకుంది. 1955లో అస్పృశ్యత నిషేధం తరువాత, ఎస్‌సి హోదాకు అస్పృశ్యత వల్ల ఏర్పడిన వెనుకబాటుతనమే ఆధారమని కమిటీ స్పష్టం చేసింది. ఎస్‌సి, ఎస్‌టి అభివృద్ధి పథకాలు డినోటిఫైడ్, నోమాడిక్ తెగలకు సరిపోవడం లేదని గుర్తించి, వారిని వేర్వేరు సమూహాలుగా గుర్తించి ప్రత్యేక పథకాలు అవసరమని సూచించింది. స్వాతంత్య్రం తరువాతి ఐదేళ్ల ప్రణాళికలు ఎస్‌సి, ఎస్‌టిల అభివృద్ధికి దోహదపడ్డాయని, అందువల్ల కొత్తగా మరిన్ని సమూహాలకు ప్రత్యేక హోదా అవసరం లేదని అభిప్రాయపడింది.
కొన్ని సమూహాలను ఎస్‌సి, ఎస్‌టి జాబితాల నుంచి తొలగించినా, వారి ప్రయోజనాలను దశలవారీగా ఉపసంహరించాలని, అలాగే గుజ్జర్లు, గడ్డీలు, బంజారాలు వంటి సమూహాలకు ఒబిసిల కంటే ఎక్కువ ప్రత్యేక సహాయం అవసరమని కమిటీ స్పష్టం చేసింది. మొత్తంగా చెప్పాలంటే, ఎస్‌టి గుర్తింపుకు లోకూర్ కమిటీ సూచించిన నాలుగు ప్రమాణాలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. షెడ్యూల్డ్ తెగల గుర్తింపు విషయంలో శాస్త్రీయత, సామాజిక న్యాయం, రాజ్యాంగబద్ధతకు బలమైన రూపరేఖను అందించిన ఈ కమిటీ నివేదికను 1967లో ప్రభుత్వానికి సమర్పించింది. అయినప్పటికీ కమిటీకి వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1976, 2003లో కొన్ని కులాలుగిరిజన తెగలలలో ఎలా విలీనమైనాయో అంతుబట్టడం లేదు. ఆ కమిటీ సిఫార్సులను న్యాయస్థానాలు, ప్రభుత్వం పునః పరిశీలించాలని ఆదివాసీలు కోరుతున్నారు.
– అక్షర భీమ్ @ 750