మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం చలి గాలులతో గజగజ వణుకుతుంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు బయటకు రా వాలంటేనే జంకుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలకు తోడు చలి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు. ఉదయం 11 గంటలు అయినా చలి తీవ్రత తగ్గకపోవడం, మధ్యాహ్నాం ఒక్కసారిగా ఎండవేడి వాతావరణం, సాయంత్రానికే మళ్లి చలి ప్రారంభం కావడంతో చిన్నారులు, వృద్ధులు, మ హిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు ఈ చలి తీవ్రతం కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. జనవరి నెల ప్రారంభంలో సాధారణ శీతాకాలం ఉన్నా, సంక్రాంతికి మళ్లీ చలి పెరిగి, చివరి వారం నుంచి తగ్గుముఖం పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నాయి. దీంతో నాలుగైదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 3 నుండి 4 డిగ్రీలు తక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో శనివారం ఉదయం వరకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 7.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, సంగారెడ్డి 7.6, ఆదిలాబాద్ 8.8, రంగారెడ్డి 9.2, సిద్దిపేట 9.4, కామారెడ్డి 9.5, నిర్మల్ 10 డిగ్రీల ఉష్ణోగత్రల నమోదయింది. దీంతో పాటు ఆదివారం తొమ్మిది జిల్లాలకు వాతావరణ కేంద్ర ఆరంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్‌ను చుట్టుముట్టిన వాయుకాలుష్యం
చలితో వణికిపోతున్న హైదరాబాద్ మహానరగరాన్ని మరోవైపు వాయు కాలుష్యం చుట్టుముట్టింది. చలి, పొగ మంచు కారణంగా వాయు కాలుష్యం పెరిగింది. శీతాకాలపు పొగమంచుకు తోడు వాహనాల ఉద్గారాలు, చెత్త దహనం వల్ల గాలిలో సూక్ష్మ ధూళికణాలు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే ఉదయం సమయంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు, పారిశ్రామిక ప్రాంతాలు, ఐటీ జోన్లు, రద్దీ ఎక్కువగా ఉండే రోడ్ల వెంట ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. హైదరాబాద్‌లో గాలి నాణ్యత ప్రమాణం 230 దాటి ప్రమాదకర స్థాయికి చేరింది. గరిష్టంగా అమీన్‌పూర్ 289 పాయింట్లు, గచ్చిబౌలిలో 286, మాదాపూర్, విట్టల్‌రావు నగర్‌లో 230 పాయింట్లుగా నమోదైంది. నగరంలోని పలు ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 పాయింట్లు దాటింది.
చలికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చలి తీవ్రతకు వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయి. జలుబు, దగ్గు, ఊపిరి తిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయి. ఆస్తమా సమస్య ఉన్నవారు, చిన్న పిల్లలు, చలి తీవ్రతకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మస్క్, షాల్, దుస్తులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. వేడి ఆహారాలు, తగినంత ద్రవాలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. జ్వరం, దగ్గు వస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని తెలుపుతున్నారు. బయటకు వెళ్లాలంటే స్వెట్టర్లు, గ్లవ్స్ ఉపయోగించాలని చెపుతున్నారు.