వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం ’అనగనగా ఒక రాజు’తో అలరించనున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మొదటి గీతం ’భీమవరం బాల్మా’ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ గీతంగా ’రాజు గారి పెళ్లిరో’ విడుదలైంది. ’అనగనగా ఒక రాజు’ నుంచి డ్యాన్స్ నంబర్ గా విడుదలైన ’రాజు గారి పెళ్లిరో’ పాట కట్టిపడేస్తోంది. మాస్ తో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉత్సాహభరితంగా సాగిన ఈ గీతం.. పండగ వాతావరణాన్ని ముందే తీసుకొని వచ్చింది. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే పెళ్లి పాటలలో ఒకటిగా ఇది నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ పాటలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తమ అసాధారణ ఎనర్జీతో పాటను మరో స్థాయికి తీసుకొని వెళ్లారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సమకూర్చిన అద్భుతమైన నృత్య రీతులతో ఈ పాటను భారీ స్థాయిలో తెరకెక్కించారు. రావు రమేష్ సహా ప్రధాన నటీనటులంతా పాల్గొనడంతో దృశ్య పరంగా ఈ పాట మరింత సంపన్నంగా, సంబరంగా మారింది. తొలి పాట ’భీమవరం బాల్మా’కు లభించిన అద్భుతమైన స్పందన తర్వాత, ఇప్పుడు చిత్ర బృందం ఈ పెళ్లి గీతంతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ‘రాజు గారి పెళ్లిరో’ను అనురాగ్ కులకర్ణి, సమీరా భారద్వాజ్ ఆలపించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. మిక్కీ జె. మేయర్ సంగీతం ఈ పాటను పండగ గీతంగా మలిచింది. ’అనగనగా ఒక రాజు’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకార స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్నారు. ’అనగనగా ఒక రాజు’ చిత్రం సంక్రాంతి కానుకగా 2026, జనవరి 14న భారీ స్థాయిలో విడుదల కానుంది.