హైదరాబాద్: మహిళల డ్రెస్‌ల విషయంలో నటుడు శివాజీ చేసిన కామెంట్స్‌ను నటుడు నాగబాబు తప్పు పట్టారు. మోరల్ పోలీసింగ్ రాజ్యాంగ విరుద్ధమని, మగ అహంకారంతో ఆడ పిల్లల వస్త్రధారణపై మాట్లాడడం సరికాదని దుయ్యబట్టారు. నాగబాబు తన ఇన్‌స్టా వేదికగా సుదీర్ఘ వీడియో విడుదల చేశారు. ఆడపిల్లలపై అలా మాట్లాడేందుకు ఏం హక్కుందని అడిగారు. ప్రపంచంలో ఫ్యాషన్ రోజురోజుకి మారిపోతుంటుందని, ఒకప్పుడు తాను కూడా ఆలోచించేవాడిని, కానీ తన ఆలోచన మార్చుకున్నానని వివరణ ఇచ్చాడు. ఆడపిల్లలను బతకనీయాలని, మగవారితో సమానంగా బతికే హక్కు వారికి లేదా? అని ప్రశ్నించారు. ఆడవాళ్లకు తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని, ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలని సూచించారు. సమాజం ప్రస్తుతం పురుషాధిక్య ఆలోచనలతో నడుస్తోందని వాటినుంచి బయటకు రావాలన్నారు. ఆడపిల్లలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలని ఎలా నడుచుకోవాలనేది మగవాళ్లు చెబితే నేర్చుకోవాల్సిన అవసరం లేదని, ప్రపంచలో ఫ్యాషన్ అనేది అనేక రకాలుగా మారుతోందన్నారు. మోడ్రన్ దుస్తులు ధరించడం తప్పు కాదని, మహిళలపై జరుగుతోన్న అత్యాచారాలు వారి డ్రెస్‌ల వల్ల కాదని, మగవాళ్ల క్రూరత్వం వల్ల అని నాగబాబు తెలియజేశారు. తాను రాజకీయ నాయకుడిగానో, ఇండస్ట్రీకి చెందిన నటుడిగానో తాను స్పందించడంలేదన్నారు. తాను శివాజీని టార్గెట్ చేయడం లేదన్నారు. ఒకవేళ అందరూ అలా అనుకుంటే తాను ఏం చేయలేనని నాగబాబు వివరణ ఇచ్చారు.