వాస్తవాలతో నిమిత్తం లేని భ్రమలు మనిషి జీవితంలో ఎటువంటి పాత్ర వహిస్తాయో మానసిక శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి రాసే ఉంటారు. వాటిని చదవగలిగితే మనకు చాలా అర్థమవుతాయి. అటువంటి అధ్యయన సూత్రాలను ప్రస్తుతం నెహ్రూ గాంధీ కుటుంబానికి అన్వయింపజేసి చూడటం అవసరమనిపిస్తున్నది. సోనియా గాంధీకి కాకున్నా, ఆ వంశ వారసులైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు. ఇటీవల కొన్ని వారాలుగా ప్రియాంక గురించిన చర్చలు జరుగుతున్నాయి. లేదా మరొకసారి జరుగుతున్నాయనాలి. లోగడ సుమారు పదేళ్ల క్రితం కూడా మాటలు వినిపించాయి. రాహుల్ గాంధీ 2004లో ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించిన తర్వాత అప్పటికి పదేళ్లు దాటిపోయాయి. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉండిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోగా, బిజెపి అధికారానికి వచ్చింది. కాంగ్రెస్ క్రమంగా ఒక్కొక్క రాష్ట్రాన్ని కోల్పోవటం మొదలైంది. సోనియా గాంధీ వయసు రీత్యా, ఆరోగ్య సమస్యల కారణంగా క్రియాశీలంగా ఉండటం తగ్గింది. అటువంటి స్థితిలో పార్టీ వాదులంతా ఇక రాహుల్ గాంధీయే తమకు పెద్ద దిక్కు అని భావించి ఆయన వైపు చూడసాగారు. కాని ఆయన వారిని నిరాశపరిచేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు. అంతలోనే 2019 ఎన్నికలు రాగా కాంగ్రెస్ రెండవసారి పరాజయం పాలైంది.
నిజానికి ఈ రెండు ఎన్నికలను మధ్యనే రాహుల్ కన్న ప్రియాంక మెరుగు అనే మాటలు వినిపించసాగాయి. ఏ విధంగా మెరుగో ఎవరూ థియరైజ్ చేసినట్లు అయితే ఏమీ చెప్పలేదు. పైకి వినిపించింది మాత్రం ఆమెలో తన నానమ్మ ఇందిరా గాంధీ పోలికలున్నాయని. వారు మాట్లాడిందంతా ముఖకవళికల పోలికల గురించి. అంతేతప్ప, ఇందిర వంటి విధానాలు, సమర్థతలు, వ్యక్తిత్వం గురించి కాదు. ఈ గతాన్ని ఇట్లాగే తవ్వుతూ పోవాలంటే, ఒక ప్రముఖ ఇంగ్లీషు మేగజైన్ కథనమే నిజమనుకుంటే, సోనియా నుంచి అధికారం రాహుల్‌కు బదిలీ కావాలా లేక ప్రియాంకకా అనే చర్చ వారి కుటుంబంలో ఆంతరంగికంగా 2014 ఎన్నికలకు ముందే జరిగిందట. కొందరు అటు, కొందరు ఇటు మొగ్గు చూపగా చివరకు రాహులే సరైన వారసుడనే నిర్ణయానికి వచ్చారట. కారణం? రాహుల్ మగబిడ్డ కావటం. వంశవారసత్వం మగ సంతానం మీదుగా జరగటం భారతీయ సంప్రదాయం. పైగా ప్రియాంక ఒక ‘బయటి మనిషి’ ని వివాహం చేసుకుంది. వారి సంతానానికి ఆ తర్వాతి వారసత్వం సంక్రమిస్తే ఒక నాయకత్వం తమ వంశాన్నే వీడిపోతుంది. అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ విధంగా బలమైన వాదనలు ముందుకు రావటంతో, ప్రియాంక తన నానమ్మను పోలి ఉన్నందున దేశ ప్రజలు ఆదరించగలరనే వాదనలు వీగిపోయాయన్నది ఆ కథనపు సారాంశం. ఆ తర్వాత ఇన్నేళ్లకు, ప్రియాంకలో ఇందిరా గాంధీ పోలికలు, ఆ కారణంగా ఆమె పార్టీ నాయకత్వానికి అర్హురాలు కావటం అనే మాటలు తిరిగి వినిపిస్తున్నాయి.
మొదటి విడత మాటలు వీగిపోయిన తర్వాత కొన్ని గమనించదగ్గవి జరిగాయి. కాంగ్రెస్ అధికారానికి గాని, పార్టీ యథాతథంగా బలపడటానికి గాని రహదారి తమ సంప్రదాయిక క్షేత్రమైన ఉత్తరప్రదేశ్ మీదుగానే అని అర్థమైన రాహుల్ గాంధీ, ఆయన సలహాదారులు, సహాయకులూ ఆయనను ఆ రాష్ట్రంలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టవలసిందిగా చెప్పారు. అప్పటికి అక్కడ సమాజ్‌వాదీ పార్టీ, బిఎస్‌పి, బిజెపి బలపడటంతో కాంగ్రెస్ బాగా బలహీనపడింది. అందువల్ల రాహుల్‌కు ఆ అజెండా సరైనది అయింది. అయితే, అంతటి బృహత్కార్య భారాన్ని సోదరుడు ఒక్కనిపై వేయటం సరికాదని భావించిన ప్రియాంక కూడా తనతో పాటు రంగంలోకి వెళ్లారు. ఇద్దరు కలిసి కూడా పార్టీని బాగు పరచలేకపోయారన్నది అట్లుంచితే, అక్కడ పని చేసిన కాలంలో అన్నాచెల్లెళ్లు ఇద్దరినీ గమనించిన అక్కడి ప్రజలు, కాంగ్రెస్ వాదులు కూడా అన్న కంటే చెల్లెలికే ఎక్కువ మార్కులు వేసినట్లు అప్పుడు పత్రికలు రాశాయి. అందుకు ఎవరి పని తీరు ఎంత కారణమో, నాయనమ్మతో మనవరాలి పోలికలు ఎంత కారణమో తెలియదు.
అయితే ఇప్పుడు పత్రికలు, మేగజైన్లలో ఫోటోలు గమనించిన వారికి, వీరిద్దరూ కలిసి గ్రామాలకు వెళ్లినప్పుడు, ముఖ్యంగా మహిళలు, యువకులు, వృద్ధులు రాహుల్ కన్న ప్రియాంక పట్ల ఎక్కువ ఆసక్తి చూపటం కనిపిచేంది. వారు ప్రియాంకను ‘ఇందిరాకీ పోతీహై’(ఇందిర మనవరాలు) అంటూ అదే పనిగా చెప్పుకుని తనతో మాట్లాడేందుకు ఉబలాటపడేవారట. అవే ఫోటోలలో రాహుల్ ఒక పక్కకు వెలవెలబోతూ కన్పించేవారు. ఇప్పుడు పరిస్థితి అక్కడేమిటో తెలియదుగాని, ప్రియాంక ఇందిర పోలికలు నాయకత్వానికి అర్హత అనే మాటలు తిరిగి ఢిల్లీలో వింటున్నాము. ఇట్లా మధ్య మధ్య ఎందుకు జరుగుతున్నట్లు? మామూలుగా కలిగే ఆలోచనలను బట్టి ఒక్క మాటలో చెప్పాలంటే, రాహుల్ గాంధీ సమర్థుడు అయి ఉంటే ఈ విధంగా భిన్నమైన ఆలోచనలకు ఎంతమాత్రం అవకాశం ఉండదు. 2004లో రాజకీయాలలోకి వచ్చిన ఆయన గత 20 సంవత్సరాల కాలంలో ఎంతో అనుభవం గడించి, పరిణితిని, సమర్థతను సాధించి, తన మాటకు ఎటువంటి ఎదురు లేదు గనుక పార్టీని బలంగా నిర్మించవలసింది.
2014 ఎన్నికలలో ఓడినా, 2019 నాటికి బిజెపిని సవాలు చేసి నిలబడవలసింది. దీనంతటిలో తగినన్ని ఇతర పార్టీలు కూడా వెంట నిలిచినందున ఆ పని కష్టం కాకూడదు. కాని అంతా అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. కాంగ్రెస్ బలహీనపడటం ఆగలేదు సరికదా, ఇటీవలి ఎన్నికల ఓటమి తర్వాత యుపిఎ కూటమి కకావికల వుతున్నది. కారణాలు అనేకం. అన్నింటిలో కనిపిస్తున్నది రాహుల్ అవగాహన రాహిత్యాలు, అసమర్థత, ఇన్నేళ్లయినా రాని పరిణతి. ఇందుకు ఉదాహరణలు ఎన్నయినా చెప్పవచ్చు. రాహుల్ కన్న ప్రియాంక మెరుగని లోగడ వచ్చిన మాటలను ప్రతిసారీ ఆ కుటుంబమే ఆగిపోయేట్లు చేసింది. ఇపుడు తాజాగా ఇమ్రాన్ మసూద్ అనే కాంగ్రెస్ ఎంపి అవే మాట అనటానికి మించి, సాక్షాత్తూ ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా అనటం సహజంగానే సంచలనంగా మారింది. అందుకు వారి కుటుంబంలోని స్పందనలు ఏమిటో మనకు వెంటనే తెలిసే అవకాశం లేదు. వీరిద్దరు ఇట్లా వ్యాఖ్యానించటమే కాదు లోక్‌సభలో అన్నాచెల్లెళ్ల వ్యవహార శైలిలో తేడాలను చూపుతూ, ఇటువంటి అభిప్రాయమే బయట కూడా కొందరికి ఏర్పడుతున్నట్లు తోస్తున్నది. ఇదంతా నేపథ్యం కాగా ఇప్పుడు అసలు విషయానికి వద్దాము.
మొదట ‘భ్రమలు’ అనే మాటలను పేర్కొనటానికి కారణం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ తన మొదటి విధానాలను, పాలనను, వాటితో పాటు ప్రజల మద్దతును క్రమంగా కోల్పోయింది. అనేక సామాజిక వర్గాలు దూరమయ్యాయి. విధానాలను పునరుద్ధరించుకుని, పాలనను సమర్థవంతంగా మార్చుకుని, ఆయా వర్గాలను తిరిగి ఆకర్షించటమన్నది పార్టీకి మౌలికమైన అవసరం. కాని ఈ లోపాలను, అవసరాన్ని గుర్తించి ఆ విధంగా కృషి చేయటం ఆగిపోయింది. అందువల్ల ఆయా వర్గాలు తమ దారి తాము చూసుకోవటం, ఇతర ప్రత్యామ్నాయాల కోసం వెతకటం జరుగుతున్నది. వాస్తవానికి ఇటువంటి పరిణామక్రమం కొన్ని దశాబ్దాల క్రితమే మొదలైంది. అవన్నీ పునాది స్థాయిలో వస్తూ వచ్చిన మార్పులు. ఇది గ్రహించటం, అందుకు తగిన చర్యలు తీసుకోవటం రాహుల్ గాంధీ ఎన్నడూ చేయలేదు. తనకు ఆ విషయం ఎప్పుడూ తోచినట్లు కూడా అనిపించలేదు. కేవలం నెహ్రూ గాంధీ వంశ నామంతో గెలవగలమని భ్రమపడ్డారు. ఇటువంటివి అవసరమని ఇప్పుడు ప్రియాంక వర్గం భ్రమపడుతున్నట్లున్నది. ఇందిర వంటి పోలికలున్నంత మాత్రాన దేశప్రజలు భ్రమపడగలరన్నది వారి అదనపు భ్రమ అవుతున్నది.
– టంకశాల అశోక్ ( దూరదృష్టి)
– రచయిత సీనియర్ సంపాదకులు