తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై రేవంత్ రెడ్డి సర్కార్ అవగాహన లేని విధంగా వ్యవహరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో కల్వకుంట్ల కవిత బృందం పర్యటించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న వట్టెం ఎత్తిపోతల పథకాన్ని, కుమ్మెర వద్ద గల పంప్ హౌస్‌ను ఆమె పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నల్లమల్ల ముద్దుబిడ్డను అని గొప్పగా చెప్పుకుంటూ, పాలమూరు తన సొంత జిల్లా అంటున్న సిఎం రేవంత్‌రెడ్డి రెండేళ్లలో పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. గత పాలకులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా పూర్తిస్థాయి అనుమతులు లేకుండా పనులు సాగిస్తే సొంత జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి పాలమూరు=రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ముందుకు రావడం లేదని విమర్శించారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేశంలోనే విస్తీర్ణంలో నెంబర్ వన్ స్థానంలో ఉందని 30 లక్షల ఎకరాల భూమి ఉన్న జిల్లాలో కేవలం 6 లక్షల 50 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించడం తగదన్నారు. జీవనది అయిన కృష్ణా నది నుంచి, దుందుభి నది నుంచి నీటిని వినియోగించుకొని 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వీలున్నా పాలకులకు పట్టకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోస్గి సభలో రూ.4300 కోట్లు ఇచ్చానన్న సిఎం వ్యాఖ్యలపై కవిత మాట్లాడుతూ.. డబ్బులు ఇచ్చుంటే పనులు ఎందుకు జరగలేదని నిలదీశారు. నారాయణపేటకొండగల్ స్కీంకు రూ.1000 కోట్లు, మేఘారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వెయ్యి కోట్లు అడ్వాన్స్ ఇచ్చారని, కానీ చరిత్రలో ఎక్కడ కూడా పనులు కాకముందే నిధులు కేటాయించిన దాఖలాలు లేవని విమర్శించారు. నారాయణపేటకొండగల్ ప్రాజెక్టులో భూసేకరణ మాత్రమే జరుగుతోందని విమర్శించారు. ఇది కరప్షన్, డైవర్షన్ పాలిటిక్స్ అని రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
900 ఎకరాలు రైతులకు తిరిగి ఇవ్వాలి
వట్టెం రిజర్వాయర్‌లో నల్లమట్టి కోసం తీసుకున్న 900 ఎకరాలు రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్లకు నల్ల మట్టిని సేకరించడానికి స్వయంగా గత ప్రభుత్వం తొమ్మిది వందల ఎకరాలను సేకరించి కాంట్రాక్టర్లకు అందించారని అన్నారు. ఆయా కాంట్రాక్టర్లు భూసేకరణ ద్వారా ఇచ్చిన 900 ఎకరాలలో నల్లమట్టిని తీయకుండా సమీపంలోని చెరువులలోని నల్ల మట్టిని ఉపయోగించారు తప్ప ఆ భూములలో మట్టిని తీయలేదని విమర్శించారు. ఆయా కాంట్రాక్టర్లు అట్టి భూమిలో తోటలు పెట్టి గేట్లు పెట్టుకొని ఫామ్ హౌస్‌లాగా వినియోగించుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. మట్టి తీయని భూములను గుర్తించి వెంటనే రైతులకు తిరిగి ఇవ్వాలని అందుకోసం జాగృతి మరో ఉద్యమానికి తెరలే పని ఉందని హెచ్చరించారు.
గురువు చంద్రబాబును సంతృప్తి పరుస్తున్నారు
ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై ఇష్టానుసారంగా ప్రాజెక్టులను అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఆంధ్ర తాజాగా నల్లమల రిజర్వాయర్‌ను నిర్మిస్తుందని ఆ ప్రాజెక్టు పూర్తి అయితే తెలంగాణకు నీటి కొరత ఏర్పడుతుందని అన్నారు. ప్రాజెక్టులను ముందే ఆపకపోతే భవిష్యత్తులో కేంద్రం పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని ఇవ్వడానికి అంగీకరిస్తుందని తద్వారా తెలంగాణకు నష్టం జరుగుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడును సంతృప్తి పరచడంలో భాగంగా రేవంత్ రెడ్డి తెలంగాణకు నష్టం జరిగే నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గత ప్రభుత్వం 90 టీఎంసీల నీటిని కేటాయిస్తే ఇటీవల రేవంత్ రెడ్డి సర్కార్ కేంద్రానికి పాలమూరు రంగారెడ్డి కి 45 టిఎంసిలు సరిపోతుందని లేఖ రాయడం తెలంగాణ హక్కులను కాలరాయడమేనని అన్నారు.