హైదరాబాద్: ఆపరేషన్ కవచ్, డ్రోన్ల వినియోగంలో మనం ముందున్నామని పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నామని, ఈ ఏడాది నగరంలో నేరాలు 15 శాతం తగ్గాయని తెలియజేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం చాలా సమర్థంగా పనిచేస్తోందని, తెలంగాణలో అడుగుపెట్టేందుకు ఇతర రాష్ట్రాల గ్యాంగ్ లు భయపడుతున్నాయని సజ్జనార్ పేర్కొన్నారు. గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది సైబర్ నేరాలు 8 శాతం, మహిళలపై నేరాలు 6 శాతం మేర తగ్గాయని అన్నారు. ఈ ఏడాది పోక్సో కేసులు కూడా బాగా తగ్గాయని, సైబర్ నేరాల విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధిక లాభాలు వస్తాయనే మాటలు నమ్మి మోసపోవద్దని.. డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
డ్రగ్ నియంత్రణకు మరిన్ని టీమ్ లు ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే ఏడాది జోనల్ వారీగా నార్కోటిక్ టీమ్ లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గతేడాది రేప్ కేసులు 484 నమోదైతే ఈ ఏడాది 405 కేసులు నమోదయ్యాయని, కిడ్నాప్ కేసులు గతేడాది 324 నమోదైతే ఈ ఏడాది 166కు తగ్గాయని అన్నారు. ప్రాపర్టీ వివాద కేసులో కూడా 64 శాతం మేర తగ్గాయని, నేరాల్లో శిక్షలు పడిన కేసులు సంఖ్య కూడా బాగా పెరిగిందని అన్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య 3,058 నుంచి 2,678 కి తగ్గాయని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య 20 శాతం మేర తగ్గిందని తెలిపారు. న్యూఇయర్ వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించాలని సూచించారు. మద్యం సేవించిన వారు బయటకు రావొద్దని సిపి సజ్జనార్ హెచ్చరిస్తున్నారు.