తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్‌టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. టెట్ వెబ్‌సైట్ నుంచి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జనవరి 3, 4, 5, 6, 8, 9, 11, 19, 20 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్-1, 2లకు కలిపి మొత్తం 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈసారి కేజీబీవీల్లో పనిచేసే కాంట్రాక్టు టీచర్లతో కలిపి దాదాపు 70 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 10 నుంచి -16 తేదీల మధ్య ఫలితాలను వెల్లడిస్తామని పాఠశాల విద్యాశాఖ గతంలోనే ప్రకటించింది.
ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ ఇవ్వాలని టిఎస్ యుటిఎఫ్ అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి వెంకట్ కోరారు. జనవరి 3 నుండి 20 వరకు జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) కేంద్రాలను సుదూరంగా కేటాయించారన్నారు. పరీక్షార్థులు 2 నుండి 3 వందల కిలోమీటర్ల దూరంలో పరీక్షా కేంద్రాలకు హాజరు కావాల్సి వస్తోందన్నారు. నిర్మల్ నుండి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం నుండి హైదరాబాద్, హైదరాబాద్ నుండి ఖమ్మం కేటాయించారని, ఏ ప్రాతిపదికన పరీక్షా కేంద్రాలు కేటాయించారో తెలియదని, కానీ అభ్యర్థులు మాత్రం ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సర్వీసులో ఉన్న
సీనియర్ టీచర్లు రెండేళ్ళలో టెట్ పాస్ కావాల్సి ఉన్నందున ఈ సారి పెద్ద సంఖ్యలో పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వ మౌలిక నిబంధనలు 9(6) సబ్ క్లాజ్ బి(3) ప్రకారం శాఖా పరమైన పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగులకు పరీక్ష, ప్రయాణ కాలాన్ని ఆన్ డ్యూటీ గా పరిగణిస్తారని వెల్లడించారు. టెట్ రాసే ఉపాధ్యాయులకు కూడా పరీక్ష, ప్రయాణ సమయాన్ని ఆన్ డ్యూటీగా మంజూరు చేయాలని, ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కు వినతిపత్రం ఇచ్చినట్లు టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చావ రవి, వెంకట్ తెలిపారు.