నాగార్జునసాగర్ ప్రాజెక్టు 1954లో ప్రారంభమైన సమయంలో నాగార్జునకొండలో పురాతత్వ పరిశోధన తవ్వకాలు ప్రారంభమైనాయి. రాయప్రోలు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సాగుతున్న ఈ పరిశోధన తవ్వకాలలో రామచంద్రన్ అనే పరిశోధకుడు, పండితుడు కూడా ఈ తవ్వకాలలో ఒక నిపుణుడుగా పాల్గొన్నారు. భులధర్మగిరి అనే చిన్న గుట్టమీద నిర్మించిన ఒక బంగాళాలో నివసిస్తూ తవ్వకాలు సాగించాడు. ఒక రాత్రి ఆయన భోజనం చేసిన విస్తరిని బయటకు పారవేయడానికి బంగళా బయట చీకటిలోకి వెళ్లింది. అక్కడే పొదలో పొంచి ఉన్న ఒక పెద్ద పులి ఆమె మీద పడి చంపివేసింది. ఆ కాలంలో నాగార్జునకొండ లోయ ఒక మహారణ్యం. ఆ అరణ్యంలో పులులు, చిరుతలు, తోడేళ్లు, ఎలుగుబంట్లు, నక్కలు మొదలైనవి చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ సంచరిస్తూ ఉండేవి.
ఈ సంఘటనను చరిత్ర పరిశోధకులు డాక్టర్ వి.వి. కృష్ణశాస్త్రి తన “భారతీయ సంస్కృతి పురాతత్వ పరిశోధనలు అనే పుస్తకంలో ప్రస్తావించారు. ప్రముఖ పురాతత్వ పరిశోధకులు నాని గోపాల్ మజుందార్ ఇప్పటి పాకిస్తాన్‌లోని గాజ్‌నది ఒడ్డున ఉన్న దాడు జిల్లా జాహి అనే గ్రామంలో కొంత మంది బందిపోట్లు దాడి చేసి చంపివేశారు. ఈయన సింధునది పరీవాహక ప్రాంతంలో ఉన్న సింధు నాగరికత అవశేషాలను ఎన్నింటినో వెలికి తీశారు. ఈ రెండు సంఘటనలు పురాతత్వ పరిశోధనలో ఉన్న ప్రమాదకరమైన పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో, అరణ్యాల్లో, పర్వతాలు, గుట్టలు, నదుల ఒడ్డున ఎటువంటి తొవ్వలు, దారులు లేని స్థలాల్లో పురాతత్వ పరిశోధకులు తవ్వకాలు జరిపి ఎంతో విలువైన మన జాతి వారసత్వ చరిత్రను, సంపదను వెలికితీశారు. తీస్తున్నారు. అందులో భాగంగానే ఎంతోమంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు. మరెందరో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నారు. కష్టాలను అనుభవించారు. ఈ రెండు సంఘటనలు అటువంటి సాహసాలకు, త్యాగాలకు నిదర్శనం.
అయితే ఈ పరిశోధన రంగంలో ఎన్ని కష్టాలు, ప్రమాదాలు, సాహసాల రీత్యా మహిళలు ముందుకు రావడం చాలా అరుదు. ఇప్పటికే వాళ్ల సంఖ్య తక్కువగానే ఉన్నది. అయితే ఇటువంటి కష్టాలను లెక్క చేయక మహిళలు కూడా మగవారితో సమానంగా తమ సత్తాను చాటగలుగుతారని నిరూపించిన మహిళలు ఉన్నారు. ఇప్పుడు అది కొంత మెరుగ్గా ఉంది. కాని స్వాతంత్య్రానికి పూర్వం అటువంటి సందర్భాన్ని ఊహించలేం. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహిళ ఒకరున్నారు. ఆమె పేరు దబేలా మిత్ర. ఆమె పురాతత్వ శాఖలో ఉద్యోగంలో చేరడం మాత్రమే కాదు, ఆ సంస్థకు జాతీయ స్థాయిలో అత్యున్నతమైన డెరెక్టర్ జనరల్ పదవిని అధిష్టించారు. అటువంటి అరుదైన సాహసి దబేలా మిత్ర శత జయంతిని ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం. అయితే ఆమెకు రావాల్సినంత ఖ్యాతి, ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇస్తున్నామో లేదో అనే సందేహం ఉన్నది. ప్రభుత్వాలు కానీ, సంస్థలు కానీ ఇటువంటి వారి గురించి పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. ఇది బాధాకరం. నేటి సమాజంలో నిజమైన నిపుణులకు, జాతి కోసం సర్వస్వం త్యాగం చేసిన మహనీయులను తలచుకోవడం లేదంటే మనం ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకోవచ్చు.
దబేలా మిత్ర నేటి బంగ్లాదేశ్‌లోని కులానాలో 1925 డిసెంబర్ 14 వ తేదీన ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె చదువు కులానాతో పాటు కలకత్తాలో కొనసాగింది. 1946లో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ప్రాచీన భారత చరిత్ర నుంచి ఎం.ఎ పట్టా పొందారు. ఆ తర్వాత పారిస్‌లో కాంబోడియా చిత్రకళ మీద పరిశోధన చేశారు. 1952 డిసెంబర్‌లో పురాతత్వ శాఖలో ఉద్యోగిగా, పరిశోధకురాలిగా చేరారు. మొదట ఆమె పురాతత్వ శాఖ తూర్పు ప్రాంత విభాగంలో పని చేశారు. ఆమె హయాం లో చాలా ముఖ్యమైన చరిత్ర తవ్వకాలు జరిగాయి. ఆమె రూపుర్, నొహర్ పోలి, మస్కి, తమబక్ ప్రాంతాల్లో జరిగిన తవ్వకాల్లో కీలక పాత్ర పోషించారు. దబేలా మిత్ర పురాతత్వ తవ్వకాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఒడిశాలోని రత్నగిరి బౌద్ధ అవశేషాలను వెలికి తీయడం. రత్నగిరిలో మిత్ర చేసిన తవ్వకాల్లో అద్భుతమైన చైత్యం, స్థూపాలు బయటపడ్డాయి. అతి పెద్ద బుద్ధుని విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఇత్తడి విగ్రహాలు, వస్తువులు కూడా అందులో దొరికాయి. ఆమె ప్రారంభించిన ఈ తవ్వకాలు ఇప్పటికీ ఆమె నిర్ణయించిన పద్ధతిలోనే జరుగుతున్నాయి.
ఆమె చేసిన మరొక అద్భుతమైన కార్యం ఒకటి ఉంది. 1987లో ఆమె బుద్ధ గయ సందర్శించారు. ఎనిమిదవ శతాబ్దానికి చెందిన ఒక అరుదైన బుద్ధ విగ్రహం మాతా ఆవరణలో కనిపించింది. మళ్లీ ఆమె 1989లో బుద్ధగయ వెళ్లింది. అయితే మాతా ఆవరణలో ఉన్న బుద్ధుని విగ్రహం అక్కడ లేదు. అయితే మాతా అధికారులు పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ విగ్రహం ఫోటో ఒకటి ప్రచురితమైంది. అది అమెరికాలోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో ఉన్నట్టు తెలిసింది. దబేలా మిత్ర వెంటనే పురాతత్వ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. అధికారులు దాని వివరాలు వెలికి తీశారు. ఈ విగ్రహం బుద్ధగయ నుంచే అమెరికా వెళ్లినట్లు దర్యాప్తులో తేల్చారు. అమెరికాలోని భారత కార్యాలయం వెంటనే మెట్రో పాలిటన్ మ్యూజియం అధికారులతో సంప్రదించింది. మెట్రో పాలిటన్ మ్యూజియం అధికారులు ఈ విషయాన్ని ఒప్పుకొని తిరిగి భారత్‌కు అప్పగించారు. 1999 మార్చి 23న ఆ విగ్రహం బుద్ధగయకు చేరింది. నిజానికి ఆమె ఆ సమయంలో పదవిలో లేరు. అయినా ఒక చరిత్ర పరిశోధకురాలిగా ఆమె తన విధ్యుక్త ధర్మాన్ని మరిచిపోలేదు.
ఆమె అంతకు ముందే అంటే 1981 83 వరకు భారత పురాతత్వ శాఖ డైరెక్టర్ జనరల్‌గా పని చేసి పదవీ విరమణ చేశారు. అయినా తన బాధ్యతలను, కర్తవ్యాన్ని మరిచిపోలేదు. అది ఆనాటి అంకిత భావానికి నిదర్శనం. ఆమె ఉద్యోగంలో ఉన్న సమయంలోనే 1975లో తెలుకుపి దేవాలయం చరిత్ర, నిర్మాణం, కౌశలం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఆమె ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు హాజరై భారతీయ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పారు. గౌతమ బుద్ధుని జన్మస్థానమైన లుంబినిలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు ఆమె చైర్ పర్సన్‌గా వ్యవహరించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆసియా టిక్ సొసైటికీ ఆమె భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1986 లో బెర్లిన్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో “బౌద్ధ, హిందూ శిల్పకళ చరిత్ర క్రమం” పైన ఒక పరిశోధన పత్రాన్ని సమర్పించారు. అంతేకాకుండా, 1969లో కోణార్క్ దేవాలయం, 1971లో బౌద్ధ చారిత్రక ప్రదేశాలు, 1978లో కాంస్య విగ్రహాల పైన పుస్తకాలను ప్రచురించారు.
ఇందులో 1971లో ప్రచురించిన “బౌద్ధ చారిత్రక ప్రదేశాలు” అన్న పుస్తకం దబేలా మిత్ర పరిశోధనా శక్తి ప్రపంచానికి చాటి చెప్పింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కశ్మీర్, పశ్చిమ పాకిస్తాన్, సింధు, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్, బీహార్‌లలో ఉన్న దాదాపు 68 బౌద్ధ చారిత్రక ప్రదేశాలపైన సవివరమైన పరిధోధన చేసి అక్షర రూపం ఇచ్చారు. అంతేకాకుండా, గౌతమ బుద్ధుని నివాసమైన కపిలవస్తుపైన ఈ పుస్తకంలో ఒక విశేషమైన పరిశోధన వ్యాసం ఉండటం గమనార్హం. ఇది 1971 లోనే ప్రచురితమై ఎంతో మంది బౌద్ధ పరిశోధకులకు మార్గదర్శక గ్రంథమైంది. భారతదేశ చరిత్ర, ప్రత్యేకించి బౌద్ధ వారసత్వ సంపద మీద ఎనలేని కృషి చేసిన దబేలా మిత్ర గురించి చరిత్ర పరిశోధకులు, ప్రభుత్వాల విభాగాలు, విశ్వవిద్యాలయాల అధిపతులు అవసరమైన సమాచారాన్ని సేకరించి భవిష్యత్ తరాలకు అందించాల్సి ఉంది.
మన దేశంలో గత కొంత కాలం నుంచి చరిత్ర పరిశోధన, అధ్యయనం పనికిమాలిన విషయాలుగా భావిస్తున్నారు. చరిత్రను తెలుసుకోకుండా వర్తమానాన్ని అర్థం చేసుకోవడం, భవిష్యత్‌ను నిర్మించుకోవడం అసాధ్యమనే తాత్వికుల సూక్తిని మనం ఏనాడో మరిచిపోయాం. ప్రభుత్వాల విభాగాలలో గాని, విశ్వవిద్యాలయాలలో గాని చరిత్ర అనే అంశానికి విలువ తక్కువ. ఆ విభాగాలకు నిధులు, ప్రాధాన్యతలు ఉండవు. అవి కేవలం ఉత్సవ విగ్రహం లాగా ఉంటాయి. ఈ ధోరణి మారాలి. చరిత్రకు మూడు ఆధారాలు. ఒకటి ప్రాచీన లిఖిత సాహిత్యం, రెండోది ప్రజల నాటకాల మీద ఉండే మౌఖిక సాహిత్యం, మూడోది వస్తు ఆధారాలు. ఇందులో ఎక్కువగా చరిత్ర క్రమాన్ని చెప్పగలిగేది వస్తు ఆధారం. అంటే భౌతిక అవశేషాలు. దానికి ఆధారం పురాతత్వ పరిశోధన. అందులో లభించిన అనేక వస్తువుల, శిలా శాసనాలు, విగ్రహాలు, కట్టడాలు మరెన్నో. మనిషికి డబ్బు, సౌకర్యాలు, విలాసాలు ఎంత అవసరమో తన గత చరిత్ర అవగాహన అంతే అవసరం. అందుకే దబేలా మిత్ర లాంటి అరుదైన ఏకైక మహిళ డైరెక్టర్ జనరల్‌గా పురాతత్వ పరిశోధన శాఖకు కొత్తపుంతలు తొక్కించిన, చరిత్ర సంపదను మనం మరిచిపోకూడదు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఆమె శత జయంతిని జాతీయ పండుగగా జరుపుకోవాలి. అప్పుడే ఆమెకు నిజమైన నివాళి.
– మల్లేపల్లి లక్ష్మయ్య( దర్పణం)
– నేడు సుప్రసిద్ధ పురాతన శాస్త్రవేత్త దబేలా మిత్ర శత జయంతి