జర్నలిస్టుల సమస్యలపై శాంతియుతంగా వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన టియుడబ్లుజె, టిజెఎఫ్ -నేతలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది కేవలం నేతల అరెస్టు మాత్రమే కాదని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే జర్నలిస్టుల గొంతును పోలీసు బలగాలతో నొక్కేసే కుట్ర అని ఆయన విమర్శించారు. కొత్త జీవో సాకుతో జర్నలిస్టుల అక్రిడిటేషన్లలో కోత విధించడం ద్వారా ప్రభుత్వం వారి ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని, ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలను మభ్య పెట్టేందుకు వచ్చిన ఆరు గ్యారంటీ లతో పాటు ప్రజాస్వామిక పరిరక్షణ పేరుతో ఇచ్చిన ఏడవ గ్యారెంటీ అంటే జర్నలిస్టులను అరెస్టు చేయడమేన అన్నారు. క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించే జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేయాల్సింది పోయి, ఉన్న వాటిని తొలగించడం ద్వారా ప్రభుత్వం వారి ఉపాధిని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు. మారుతి సాగర్, రమేశ్ హజారి, యోగానంద్, విష్ణువర్ధన్ రెడ్డి, రమణ కుమార్, కడకంచి వెంకట్ వంటి కీలక నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను, నిర్బంధాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ అక్రిడిటేషన్ల పునరుద్ధరణ కోసం సాగే పోరాటంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.