సిల్హెట్: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఆ దేశంలో ఘనంగా జరుగుతోంది. అయితే ఈ లీగ్‌లో ఓ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఢాకా క్యాపిటల్స్, రాజ్‌షాహి రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగే కొన్ని నిమిషాల ముందు ఢాకా క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జాకీ(59) ఆకస్మికంగా మరణించారు. మ్యాచ్‌కి ముందు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అలీ జాకీ మైదానంలో కుప్పకూలిపోయారు. వెంటనే ఫిజియోలు ఆయనకు సిపిఆర్ నిర్వహించారు. అనంతరం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అలీ జాకీ మరణించారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజిషీయన్ దేబాశిష్ చౌదరి ధృవీకరించారు.
అయితే మహబూబ్ అలీ జాకీ మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని ఇంకా వెల్లడించలేదు. వైద్యులు ఆయనకు గుండెపోటు వచ్చిందని అనుమానిస్తున్నారు. అయితే ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. ఫిట్‌గా ఉన్నారని సహచరలు చెబుతున్నారు. అలీ మరణవార్త తెలియగానే ఆటగాళ్లు, అధికారులు దిగ్ర్భాంతికి గురయ్యారు. వెంటనే సిల్హెట్ టైటాన్స్, నోవాఖలీ ఎక్స్‌ప్రెస్, చట్టోగ్రామ్ రాయల్స్ జట్లకు చెందిన ప్లేయర్లు, కోచ్‌లు తమ ప్రాక్టీస్ ఆపేసి ఆస్పత్రికి వెళ్లారు. జాకీ మృతి పట్ల బంగ్లాదేశ్ క్రికెట్ ఎక్స్ వేదికగా సంతాపం వ్యక్తం చేసింది.