మన తెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతికి కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం జరుగనుంది. పా ర్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారికి పదవుల ను కట్టబెట్టి రానున్న ఎన్నికల్లో మరిన్ని విజయాల ను సాధించే దిశగా సిఎం రేవంత్‌రెడ్డి సమాయ త్తం అయ్యారు. ఈ నేపథ్యంలోనే కార్పొరేషన్ పదవులు, పార్టీ పదవులకు సంబంధించిన జాబితా తీ సుకొని సిఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ జాబితాపై అధి ష్ఠానంతో సిఎం చర్చించనున్నారు. నేడు ఢిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఆయన పాల్గొనడంతో పాటు ఎల్లుండి కూడా సిఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలోనే ఉండి పార్టీ పదవులు, మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంతో చర్చించనున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే పార్టీ పదవులకు సంబంధించి అర్హులతో కూడిన జాబితాను రూపొందించే బాధ్యతను డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు చేపట్టారు. ఆ జాబితాను రూపొందించి ముఖ్యమంత్రికి వారు అం దించడంతో అధిష్ఠానానికి సిఎం రేవంత్‌రెడ్డి ఆ జా బితాను అందించనున్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతోపాటు జనవరి మూడో వారంలో కాంగ్రెస్ ఓబిసి జాతీయ సలహా మండలి భేటీ హైదరాబాద్‌లో జరుగనుండగా, ఈ కార్యక్రమాని కి రాహుల్‌గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీంతో నేడు ఢిల్లీలో జరిగే సీడబ్లూసీ స మావేశంలో ఈ కార్యక్రమం గురించి చర్చించనున్నట్టుగా సమాచారం.
28న రాత్రి తిరిగి హైదరాబాద్‌కు
సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం సిఎం రేవంత్ రెడ్డి కేంద్రంలోని సంబంధిత శాఖల మంత్రులతో విడివిడిగా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ప్రాజెక్టులు, అనుమతులు వంటి అంశాలపై చర్చించనున్నట్టుగా తెలిసింది. సిఎం రేవంత్ రెడ్డి ఈ నెల 28న రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఈనెల 29వ తేదీన జరుగనున్న అసెంబ్లీ సమావేశాలకు సిఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై ప్రభుత్వం తరఫున సిఎం మాట్లాడే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. ఢిల్లీలో శనివారం ఉదయం 10.30 గంటలకు ఏ ఐసిసి కార్యాలయం ఇందిరాభవన్‌లో జరిగే సీడబ్లూసీ సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, రానున్న ఎన్నికలు, పార్టీ వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టుగా తెలిసింది.
దీంతోపాటు కాంగ్రెస్ ఓబిసి జాతీయ సలహా మండలి భేటీ జనవరి మూడోవారంలో హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ భేటీకి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఓబిసి వర్గాలకు సంబంధించిన విధానాలు, రాజకీయ వ్యూహాలు, రానున్న ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సీడబ్లూసీ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఓబిసిలకు కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణ, సామాజిక న్యాయం అంశంపై స్పష్టమైన దిశానిర్దేశం చేసే అవకాశముంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్లూసీ) సమావేశాల అనంతరం ఓబిసి జాతీయ సలహా మండలి ప్రత్యేకంగా భేటీ కానుంది. ఈ భేటీలో హైదరాబాద్ సమావేశానికి సంబంధించిన తేదీ, ఎజెండా, ఇతర ఏర్పాట్లపై నిర్ణయం తీసుకోనున్నారు. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం పార్టీ అగ్రనాయకత్వం ఈ సమావేశాన్ని అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశంలో ఓబిసి జాతీయ సలహా మండలి ఎజెండాతో పాటు శిక్షణ తరగతులు కూడా నిర్వహించనున్నట్లుగా సమాచారం. ఈ సమావేశానికి హాజరై చర్చల్లో పాల్గొనాలని ఓబిసి జాతీయ సలహా మండలి సభ్యుడు, మాజీ ఎంపి హనుమంతరావుకు అధికారిక ఆహ్వానం అందినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు దేశవ్యాప్తంగా పలువురు కీలక ఓబిసి నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.