హైదరాబాద్: ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి ధైర్యం.. రాజీనామా చేయడానికి తన ధైర్యం.. కార్యకర్తలేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. కార్యకర్తల అండతోనే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఉపఎన్నిక వస్తే.. మళ్లీ గెలుస్తానని అన్నారు. హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాజీనామాపై, ఉపఎన్నికల్లో పోటీ చేయడంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సిఎం పదవికి గౌరవం ఇవ్వడం మరిచింది బిఆర్ఎస్ నేతలేనని, సిఎం రేవంత్ రెడ్డిను ఏకవచనంతో అగౌరవంగా మాట్లాడింది బిఆర్ఎస్ వాళ్లేనని తెలియజేశారు. విమర్శలు చేస్తే.. ప్రతి విమర్శలూ ఎదుర్కోవాల్సి ఉంటుందని దానం నాగేందర్ సూచించారు. సిఎం స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడితే, ఆ వ్యక్తి కూడా కిందికి మాట్లాడాల్సి వస్తుందని, గురివింద గింజకు తన కింద ఉన్న నలుపు తెలియదని పేర్కొన్నారు. సిఎం స్థాయి వ్యక్తికి గౌరవం ఇవ్వలేదని మండిపడ్డారు. ఏకవచనంతో సంబోధించడం సరికాదని హితవు పలికారు. అభివృద్ధిపై చర్చకు రావాలని బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు సవాల్ విసిరారు. అలాగే, మంత్రుల అవినీతిపై కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను దానం తప్పుపట్టారు. బండి సంజయ్ వద్దే దర్యాప్తు సంస్థలు ఉన్నాయని, ఆధారాలు ఉంటే విచారణ జరిపించాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు.