మెల్‌బోర్న్: 2025-26 యాషెస్ సిరీస్‌లో ఎట్టకేలకు ఇంగ్లండ్ తొలి విజయం సమోదు చేసింది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ముందు ఆడిన మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన చేసింది. మూడు మ్యాచుల్లోనూ ఆసీస్‌పై ఆధిపత్యం సాధించలేకపోయింది. తద్వారా 3 మ్యాచుల్లోనూ ఓడిపోయి.. సిరీస్‌ని ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. కానీ, నాలుగో టెస్టులో మాత్రం ఇంగ్లండ్ దూకుడుగా ఆడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాని 152 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. 110 పరుగులకే ఆలౌట్ అయింది.
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ తిరిగి పుంజుకుంది. ఆసీస్‌ని ఈ సారి 132 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో ఇంగ్లండ్ ముందు ఆస్ట్రేలియా 175 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్య చేధనలో ఇంగ్లండ్ ఓపెనర్లు 51 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. జాక్ క్రాలీ 37, బెన్ డక్కెట్ 34 పరుగులు చేసి ఔట్ అయ్యారు. కీలక సమయంలో జాకబ్ బెథెల్ రాణించాడు. 40 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో ఇంగ్లండ్ 32.2 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో 3-1 తేడాతో ఆస్ట్రేలియా లీడింగ్‌లో ఉంది.