హైదరాబాద్: నాటి డ్రగ్స్ కేసులో ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయని కేంద్రమంతి బండిసంజయ్ తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ సభ్యులూ డ్రగ్స్ తీసుకున్నారని.. కొందరు వాంగ్మూలమిచ్చారని అన్నారు. డ్రగ్స్ కేసుపై బండి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పండగలప్పుడే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా? అని అకున్ సభర్వాల్ ఆధ్వర్యంలో నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైంది? అని ప్రశ్నించారు. నిందితుల వాంగ్మూలాలు, ఆడియో, వీడియోలు రికార్డు చేశారని, కుటుంబ సభ్యుల భవిష్యత్తు నాశనమౌతుందనే భయంతో కెసిఆర్ ప్రభుత్వం నాటి డ్రగ్స్ కేసును నీరు గార్చిందని విమర్శించారు. అకున్ సభర్వాల్ ను డ్రగ్స్ కేసు విచారణ నుంచి తప్పించారని, అకున్ సేకరించిన ఆధారాలను నాటి సిఎస్ సోమేశ్ స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. అకున్ సభర్వాల్ సేకరించిన ఆధారాలు ఏమయ్యాయి? అని..తక్షణమే సోమేశ్వర్ ను విచారించాలని సూచించారు. ఈగల్ బృందంలో కొందరు డ్రగ్స్ పెడ్లర్లతో రాజీపడుతున్నారని, అకున్ సభర్వాల్ కు డ్రగ్స్ కేసు విచారణ బాధ్యత తిరిగి అప్పగించాలని బండిసంజయ్ కోరారు.