కుటుంబ సభ్యుల పైనే పలుమార్లు దాడికి పాల్పడిన కేసులో అమెరికాలో భారత సంతతి విద్యార్థిని కొల్లిన్ కౌంటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి తెలుగు మూలాలున్నట్టు సమాచారం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం , టెక్సాస్ యూనివర్శిటీలో చదువుతున్న 22 ఏళ్ల మనోజ్ సాయి లేళ్ల అనే భారత సంతతి యువకుడు తరచూ తమపై బెదిరింపులకు దిగుతూ దాడి చేస్తున్నట్టు అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఓ ప్రార్థనాస్థలంలో ఉద్దేశ పూర్వకంగా అగ్ని ప్రమాదానికి పాల్పడటం, కుటుంబ సభ్యులపై ఉగ్ర బెదిరింపులకు దిగడం, తమ ఇంటికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కొంత కాలంగా అతడు పలు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.