సిరియాలో శుక్రవారం ప్రార్థనల సమయంలో ఓ మసీదు వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రార్థనలు చేస్తున్న అలావైట్ ముస్లింలలో ఎనమండుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. సిరియా హామ్స్ ప్రాంతంలో ఈ మసీదు నెలకొని ఉంది. ఘటనను ఉగ్రవాద చర్యగా నిర్థారించారు. ఇక్కడి మైనార్టీ వర్గం అయిన అలావైట్‌పై దాడి జరిగింది. సిరియా అధికారిక వార్తా సంస్థ సనా ఘటనను తెలిపింది. సిరియాలో ఇస్లామిక్‌లు పాలన పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన రెండో భీకర దాడి ఇదే. జూన్‌లో ఓ చర్చిలో జరిగిన పేలుడులో 25 మంది చనిపోయారు. ప్రార్థనల సమయం చూసుకునే మసీద్ లక్షంగా దాడి జరిగిందని అధికారులు నిర్థారించారు. సిరియా అంతర్యుద్ధం దశలో హామ్స్ ప్రాంతం భీకర పరస్పర దాడులు, హింసాకాండకు వేదిక అయింది. మసీదులో ముందుగానే అమర్చి ఉంచిన మందుపాతరలను గురి చూసుకుని నమాజుల దశలోనే పేల్చివేశారని వెల్లడైంది.