మెల్‌బోర్న్: హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే యాషెస్ సిరీస్‌ను సొంతం చేసుకున్న ఆతిథ్య ఆస్ట్రేలియా శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టు మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. బాక్సిండ్ డే టెస్టు మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్‌స్వీప్‌కు మరింత చేరువ కావాలనే పట్టుదలతో ఉంది. ఇక ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్ కనీసం మిగిలిన మ్యాచుల్లోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియాను ఓడించడం ఇంగ్లండ్‌కు శక్తికి మించిన పనిగానే చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు ఆస్ట్రేలియాలో కొదవలేదు. అలెక్స్ కారె, ట్రావిస్ హెడ్, లబుషేన్, స్టీవ్ స్మిత్, గ్రీన్, ఉస్మాన్ ఖ్వాజా తదితరులతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. వీరు ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. హెడ్, ఖ్వాజా, కారెలతో పాటు కెప్టెన్ స్మిత్ ఫామ్‌లో ఉండడం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు.
ఇక స్టార్క్, బొలాండ్, నెసర్, రిచర్డ్‌సన్‌లతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్న ఇంగ్లండ్‌కు గాయాలు మరింత ప్రతికూలంగా మారాయి. మిగిలిన మ్యాచ్‌లకు స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు. ఇది జట్టును మరింత కలవరానికి గురి చేస్తోంది. జాక్ కార్లె, డకెట్, రూట్, బ్రూక్, జేమీ స్మిత్, జాక్స్, కెప్టెన్ స్టోక్స్, ఓలిపోప్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నా ఇంగ్లండ్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి స్థితిలో మిగిలిన రెండు మ్యాచ్‌లు కూడా ఇంగ్లండ్‌కు సవాల్ వంటివేనని చెప్పక తప్పదు.