ఏమన్నా అంటే తనకు అహంకారం అంటారని, కానీ అసలైన అహంకారం రేవంత్ రెడ్డిదా లేక తనదా అని ప్రజలు ఆలోచించాలని కెటిఆర్ కోరారు. తాను గుంటూరులో చదువుకుంటే రేవంత్ రెడ్డికి ఎందుకు ఇబ్బంది అని పేర్కొన్నారు. తాను ఆంధ్రాలో చదువుకుంటే తప్పంటున్న రేవంత్, ఆంధ్రా నుంచి అల్లుడిని తెచ్చుకోవడం తప్పు కాదా..? అని అడిగారు. అందుకే ఈయనకు భీమవరం బుల్లోడు అని పేరు పెడితే సరిపోతుందని ఎద్దేవా చేశారు.అప్పుడు గుంటూరు ఆంధ్రప్రదేశ్‌తో కలిసి ఉందని చెప్పారు. తాను గుంటూరులోనే కాకుండా హైదరాబాద్, పూణే, అమెరికాలో చదువుకున్నానని పేర్కొన్నారు. కానీ, రేవంత్ మాదిరిగా తాను చదువు సంధ్య లేకుండా తిరగలేదని, రేవంత్‌కు వారి అమ్మయ్య చక్కటి తోవ చూపించకపోతే తానేం చేయాలని ఎద్దేవా చేశారు. తనకు ఇంగ్లీష్, హిందీ రావడం చూసి రేవంత్ రెడ్డి ఎందుకు ఏడుస్తున్నారని, సత్తా ఉంటే ఆయన కూడా నేర్చుకోవాలని, ఆయనను ఎవరూ ఆపలేదని చురకలంటించారు. తన తండ్రి పేరు చెప్పుకోవడం తనకు గర్వకారణం అని వ్యాఖ్యానించారు. ‘మా అయ్య మొగోడు, తెలంగాణ తెచ్చిన మొనగాడు, ఆయన పేరు నేను బరాబర్ చెప్పుకుంటా’ అని కెటిఆర్ పేర్కొన్నారు.