యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో స్వామి వారి దర్శనానికి వస్తున్న భక్తులతో యాదగిరిగుట్ట సందడిగా మారింది. స్వామివారి శీఘ్ర దర్శనానికి 3 గంటలు, అతిశీఘ్ర దర్శనానికి గంటలకుపైగా సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండపైన, కొండ కింద పలు ప్రాంతాల్లో ఎటు చూసినా భక్తుల రద్దీ కనిపించింది. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైకి వెళ్లే ఘాట్‌రోడ్డు ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. శని, ఆదివారాల్లో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
నేత్రపర్వంగా ఊంజల్ సేవ..
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శ్రీ ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో శ్రీపాంచరాత్రాగమన ప్రకారం కొండపైన అద్దాల మండపంలో ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు అమ్మవారికి మంగళహారతులు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
యాదగిరీశుడికి నిత్యపూజలు..
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి నిత్యపూజలు కొనసాగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం, అర్చనను శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతించారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, నిత్యబ్రహ్మోత్సవం, వెండి జోడి సేవ, స్వర్ణపుష్పార్చన, శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజలు నిర్వహించారు. అనంతరం కొండపైన కొలువైన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగే శ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ఆలయంలో జరిగిన నిత్యపూజలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనుర్మాసోత్సవాల సందర్భంగా గోదాదేవికి తిరుప్పావై నిర్వహించగా మహిళా భక్తులు మంగళహారతులతో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యరాబడి రూ.35.20 లక్షలు..
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి శుక్రవారం నిత్యరాబడిలో భాగంగా రూ.35,20,538 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1,73,150, బ్రేక్ దర్శనం ద్వారా రూ.2,94,900, శ్రీసత్యనారాయణ వ్రతాల ద్వారా రూ.1,59,000, రూ.150 విఐపి దర్శనం ద్వారా రూ.5,25,000, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.6,71,000, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.79,916, ప్రసాద విక్రయం ద్వారా రూ.11,61,020, కల్యాణకట్ట ద్వారా రూ.65,000తోపాటు వివిధ శాఖలు, పాతగుట్ట ఆలయం ద్వారా ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
స్వామి వారి సేవలో..
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామి వారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు.