జిల్లాలోని తాడ్వాయి మండలం, మేడారంలో కొలువైన వనదేవతలు సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆదివాసీ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం మహాజాతర వచ్చే జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న నేపథ్యంలో క్రిస్మస్, బాక్సింగ్ డే సందర్భంగా సెలవు దినం కావడంతో ముందస్తుగా మొక్కులు చెల్లించేందుకు వేలాది మంది భక్తులు మేడారం బాట పట్టారు. ఉదయం నుంచే మేడారం వెళ్లే రహదారులన్నీ వాహనాల రద్దీతో నిండిపోయాయి. భక్తులు ముందుగా జిల్లా కేంద్రంలోని గట్టమ్మను దర్శించుకుని, అనంతరం మేడారం చేరుకుని జంపన్నవాగులో కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు ఆచరించారు. పసుపు, కుంకుమ, చీరలు, ముడుపులు, బంగారంతో అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెలించారు. మేడారానికి భక్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.