అమరావతి: ఐటీ వల్ల ప్రపంచంలో తెలుగువారు ఎక్కువ వేతనాలు పొందుతున్నారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలో హైదరాబాద్ లో ఐటీని ప్రోత్సహించామని అన్నారు. తిరుపతిలో జాతీయ సంస్కృత వర్శిటీలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం లో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రపంచంలో అత్యధిక వేతనాలు భారతీయులే పొందుతున్నారని, విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ వచ్చిందని తెలియజేశారు. మన పురణాలను నేటి యువతకు వివరించాలని.. అవతార్ సినిమా కంటే రామాయణం, మహాభారతం గొప్పవని మన పిల్లలకు చెప్పాలని అన్నారు. సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కాకుండా అర్జునుడు, హనుమాన్ గురించి చెప్పాలని.. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ వంటి గొప్ప వ్యక్తుల గురించి నేటి సమాజానికి చెప్పాలని సూచించారు. భారతదేశంలో నాలెడ్జ్ కు కొదవ లేదని, మానసిక ఒత్తిడిని అధిగమించడంలో యోగాది కీలకపాత్రని సిఎం పేర్కొన్నారు. ఇటీవల విశాఖలో కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించామని అన్నారు.
దేశాభివృద్ధిలో అనేక రంగాలు మిళితమై ఉన్నాయని, 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత అత్యంత కీలక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తుందని, ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులే ఉన్నారని అన్నారు. 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మార్మోగుతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. దశాబ్దకాలంగా చాలా దేశాల్లో జనాభా వృద్ధి తగ్గుతోందని, భారత్ లో మాత్రమే జనాభా వృద్ధి జరిగిందని అన్నారు. 2038 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తోందని, 2047 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని అన్నారు. ఎలాంటి పదవి ఆశించకుండా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సమాజానికి సేవ చేస్తున్నారని కొనియాడారు. తిరుపతిలో స్పేస్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ, అనంతపురంలో ఏరో స్పేస్ సిటీ, విశాఖలో మెడ్ టెక్ పార్కు తీసుకొస్తున్నామని అన్నారు. జల భద్రత ఉంటే దేశంలో అద్భుత కార్యక్రమాలు చేయగలమని చంద్రబాబు స్పష్టం చేశారు.