మన తెలంగాణ/హైదరాబాద్: రానున్న సంక్రాం తి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఈసారీ తి ప్పలు తప్పేటట్లు లేదు. దూరప్రాంతాలకు వెళ్లే రై ళ్లు, బస్సుల్లో టికెట్లన్నీ పూర్తి స్థాయిలో ఇప్పటికే బుకింగ్ అయిపోయాయి. హైదరాబాద్ మహానగ రం నుంచి ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక వెళ్లే రె గ్యులర్ రైళ్లలో ఒక్క బెర్త్ కూడా లేదు. రెండు నెల ల ముందే కేవలం నిమిషాల వ్యవధిలోనే పండుగ రోజులకు టికెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో రె గ్యులర్‌గా నడిచే రైళ్లన్నీ సంక్రాంతి నాలుగు రోజులకు ముందు నుంచే భారీ వెయిటింగ్ లిస్ట్‌లోకి వెళ్లిపోయాయి. మరికొన్ని రైళ్లలో అయితే రిగ్రెట్ చూపిస్తోంది. ఆంధ్రా వైపు విశాఖపట్నం, కాకినా డ, విజయవాడ, శ్రీకాకుళం, తిరుపతి, గుంటూ రు, రాజమండ్రి మార్గాల్లో ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ నెలకొంది. మహారాష్ట్రలోని నాందే డ్ వరకు, చెన్నై సెంట్రల్ వరకు,ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, శ్రీకాకుళం వరకు సంక్రాంతి ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను రై ల్వే ప్రకటించింది.
ఇప్పటికే 120 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే మరో 15 నుంచి 20 రైళ్లను తాజాగా ప్రకటించింది. దీంతో వాటికి రిజర్వేషన్లు చేసుకునే అవకాశం ఇవ్వడంతో వెం టవెంటనే ఆ టికెట్లు కూడా బుక్ అయిపోయా యి. కాగా ఎంత రద్దీ ఉన్నా అవకాశాన్ని బట్టి 600 రైళ్ల వరకు నడుపుతామని రైల్వే ప్రకటించిం ది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి, లింగంపల్లి స్టేషన్ల నుంచి బయలుదేరుతాయి. ఈ సంక్రాంతికి హైదరాబాద్, సికింద్రాబాద్, నగర శివారు ప్రాంతాల నుంచి రైళ్ల ద్వారానే 30 లక్షల మందికిపైగా ప్రయాణించే అవకాశం ఉందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా మరిన్ని రైళ్లు నడిపేందుకు సమాయత్తం అవుతోంది. జనవరి 9 నుంచి ప్రారంభించి 19 వరకు, అలాగే తిరుగు ప్రయాణంలో జనవరి 26 వరకు ప్రత్యే క రైళ్లను నడుపుతూ రైల్వే షెడ్యూల్‌ను ప్రకటించింది. వందేభారత్ రైళ్లలోనూ పండుగ సీజన్‌లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది.
సహజంగా రైళ్లలో కంటే ఆర్టీసి, ప్రైవేటు రంగంలో నడిచే ప్రత్యేక బస్సుల్లో అదనంగా చార్జీలు వసూలు చేయడం వల్ల సాధారణ, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా రైళ్లపై ఆధారపడతుంటారు. ప్రత్యేక రైళ్లలోనైనా ప్రయాణించేందుకు సిద్ధపడుతుంటారు. ప్రత్యేక రైళ్లకూ చార్జీలు అదనంగా వసూలు చేస్తున్నప్పటికీ బస్సుల కన్నా చాలా తక్కువ ఉండడం వల్ల రైళ్లను నమ్ముకుని ప్రయాణం చేస్తున్నారు. ఇక ఏపిఎస్‌ఆర్టీసి, టిజిఎస్‌ఆర్టీసి కూడా సంక్రాంతికి భారీ ఎత్తున ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించాయి. ప్రధానమైన రెగ్యులర్ రైళ్లు ఫలక్‌నుమా, గౌతమి, విశాఖ, గరీబ్ రథ్, మహబూబ్ నగర్-విశాఖ సూపర్ ఫాస్ట్, నర్సాపూర్, చార్మినార్‌తో పాటు చాలా రైళ్లలో భారీ వెయిటింగ్ లిస్ట్ ఉంది. వీటిలో స్లీపర్‌తో పాటు అన్ని తరగతులకూ టికెట్లు బుక్ అయ్యాయి. కోణార్క్, జన్మభూమి, ఈస్ట్‌కోస్ట్ రైళ్లలోనూ ఇదే పరిస్థితి. దీంతో సంక్రాంతికి రైలు ప్రయాణ కష్టాలు తప్పవనే సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై ట్రాఫిక్ విపరీతంగా నిలిచిపోతున్న సంఘటనల నేపథ్యంలో రైళ్లను ఎక్కువ మంది ఆశ్రయించే అవకాశం ఉంది. వికారాబాద్ మచిలీపట్నం, వికారాబాద్ కాకినాడకు ఈ సారి ప్రత్యేక రైళ్లను రైల్వే ప్రకటించింది. మహబూబ్‌నగర్- కాచిగూడ- విశాఖపట్నం, గుంటూరు, తెనాలి రేపల్లె డెల్టా ఎక్స్‌ప్రెస్‌తో పాటు కర్నూల్ మీదుగా రాకపోకలు సాగించే చెన్నై చెంగల్పట్టు, చిత్తూరు వెంకటాద్రి, పుదుచ్చేరి, బెంగళూర్- అశోకపురం, యశ్వంత్‌పూర్ తదితర రైళ్లలో పండుగకు ముందుగానే టికెట్ల రిజర్వేషన్ పూర్తిగా అయిపోయాయి. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు వెళ్లే వారికి రిజర్వేషన్లు మరింత కష్టంగా మారాయి. ప్రత్యేక రైళ్లపైనే వారు ఆధారపడుతున్నారు.
అదనపు చార్జీలతో అదనపు ఆర్థిక భారం
పండుగకు సొంతూళ్లకు వెళదామనుకునే వారికి టికెట్లు దొరక్క ప్రైవేటు బస్సులు, ప్రత్యేక రైళ్లను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. గత ఏడాది సంక్రాంతి సీజన్‌లో ఏపిఎస్‌ఆర్టీసి, టిజిఎస్‌ఆర్టీసిలు ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేశాయి. రెగ్యులర్ సర్వీసుల్లో అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని, కేవంలం ప్రత్యేక సర్వీసుల్లోనూ వసూలు చేస్తున్నట్లు ఆర్టీసి వివరణ ఇచ్చింది. ఈసారి కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఇక ప్రత్యేక రైళ్లలోనూ అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్లు రైల్వే ఇప్పటికే ప్రకటించింది. రైళ్లలో చార్జీలను సాధారణ రోజుల్లో కన్నా 20 శాతం వరకు ఆయా తరగతులను బట్టి ప్రత్యేక చార్జీలను వసూలు చేస్తోంది. దీంతో ప్రైవేటు బస్సులను ఆశ్రయించే కన్నా ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. కాగా గత ఏడాది ప్రత్యేక సర్వీసుల పేరుతో ఆర్టీసి 50 శాతం చార్జీలను అదనంగా వసూలు చేసింది. ప్రైవేటు సర్వీసుల విషయానికొస్తే సాధారణ రోజుల్లో కేటగిరీని బట్టి బస్సు సర్వీసుల్లో రూ.1200 నుంచి రూ.3500 ఉండే చార్జీలు
ఉండగా పండుగ రద్దీకి అనుగుణంగా అప్పుడు రూ.2500 నుంచి రూ.7 వేల వరకు వసూలు చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి వెళ్లే స్లీపర్ బసుల్లో ఒక్కో టికెట్ రూ.4,239 నుంచి రూ.6239 వసూలు చేశారు. వోల్వోలాంటి బస్సుల్లో అయితే 7 వేలకు పైమాటే ఉంది. విజయవాడకు వెళ్లే ప్రయాణీకుల నుంచి గరిష్టంగా రూ.3600 వసూలు చేశారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రైవేటు బస్సులకు అధిక చార్జీలు చెల్లించే పనిలేకుండా ఆర్టీసి బస్సులను తెలంగాణ ప్రభుత్వం నడుపుతోంది. పండుగ సమయానికి సుమారు నాలుగు వేల అదనపు సర్వీసులు నడపాలని భావిస్తోంది. అయితే ఆ బస్సుల్లోనూ అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. కొంత వరకు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ ప్రైవేటు సర్వీసుల కన్నా చాలా తక్కువ ఉండడం వల్ల ఆర్టీసిని ఆదరించారు. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు టీజీఎస్ ఆర్టీసీ గడచిన సంక్రాంతికి 6 వేలకు పైగా ప్రత్యేక బస్సులను 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేసింది. ఈ సారి కూడా పెద్ద ఎత్తున ఆర్టీసి ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమవుతోంది.